Michaung' Cyclone: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. తుపాను ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా, పాండిచ్చేరి, కారైకల్ యానాంలో విద్యా సంస్థలను సర్కారు సెలవు ప్రకటించింది. తమిళనాడులో సోమవారం సెలవు దినంగా ప్రభుత్వం వెల్లడించింది. తుపాను దృష్ట్యా వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయించాలని ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాటికి తుపాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
మిచౌంగ్ తుపాను నైరుతి బంగాళాఖాతం మీదుగా ప్రస్తుతం గంటకు 8 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. తుపాను సోమవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. డిసెంబర్ 5 (మంగళవారం) తెల్లవారుజామున నెల్లూరు- మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులు గంటకు 100 కి.మీ నుంచి110 కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ పేర్కొంది. తుపాను నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో 21 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను ఆయా ప్రభుత్వాలు మోహరించాయి. మరో ఎనిమిది అదనపు బృందాలను రిజర్వ్‌లో ఉంచాయి.