Cyclone Michaung: కోస్తాంధ్ర వైపు ముంచుకొస్తున్న 'మైచాంగ్' తుపాను.. ఏపీకి ఐఎండీ రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను హెచ్చరికలను ఐఎండీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం (డిసెంబర్ 3)నాటికి తుపానుగా మారనుంది.
ఈ తుపానుకు 'మైచాంగ్(Michaung)' అనే పేరు పెట్టారు. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడనున్నాయి.
మైచాంగ్ తుపాను(Cyclone) ప్రభావంతో డిసెంబర్ 3-5 మధ్య రాయలసీమ, కోస్తాంద్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో 4,5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తుపాను డిసెంబర్ 4సాయంత్రం సమయానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య దక్షిణ కోస్తాంధ్ర వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది.
తుపాను
ఏపీలో భారీగా వర్షాలు
ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో ఆదివారం, సోమవారాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కరుణ సాగర్ చెప్పారు.
డిసెంబరు 5న మైదాన ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆయన అంచనా వేశారు.
రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
తుపాను ఆందోళనల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా సీఎస్‌లను కేంద్రం అప్రమత్తం చేసింది.
తుపాను
డిసెంబరు నెల్లూరు-మచిలీపట్నం మధ్య 5న తీరం దాటే అవకాశం
తుపాను డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని ఐఎండీ ఎంచనా వేసింది.
నెల్లూరు-మచిలీపట్నం మధ్య డిసెంబరు 5వ తేదీన తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లిడించింది.
ఆ సమయంలో గరిష్టంగా గంటకు 80-90కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఈదురు గాలులు గంటకు 100 కి.మీ.వేగంతో వీస్తాయని వెల్లడించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 12జిల్లాల పాలకవర్గాలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
రానున్న 2-3రోజుల్లో తమిళనాడులోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయడంతో సహా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.