LOADING...
Telangana: మొంథా తుపానుతో తెలంగాణకు భారీ దెబ్బ.. 1.17 లక్షల ఎకరాల్లో పంట నష్టం!
మొంథా తుపానుతో తెలంగాణలో భారీ పంట నష్టం.. 1.17 లక్షల ఎకరాలకు దెబ్బ!

Telangana: మొంథా తుపానుతో తెలంగాణకు భారీ దెబ్బ.. 1.17 లక్షల ఎకరాల్లో పంట నష్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మొంథా తుపాన్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,17,757 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం చెల్లించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ సమర్పించిన నివేదికపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయశాఖ బృందాలు సర్వే నిర్వహించాయని, 33%కు పైగా పంటనష్టం జరిగిన రైతుల వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేశామని చెప్పారు. మొత్తం 27 జిల్లాల్లో 1,22,142 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారని తెలిపారు. నష్టాల వివరాలను వెల్లడిస్తూ మంత్రి తుమ్మల తెలిపారు.

Details 

మొక్కజోన్న పంటలు పూర్తిగా దెబ్బ

83,407 ఎకరాల్లో వరి, 30,144 ఎకరాల్లో పత్తి, 2,097 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం పరిహారం లెక్కలు వేస్తే— ఎకరంలో ఇసుక మేటల కింద నష్టానికి రూ.7,285 ప్రాజెక్టులు, చెరువుల కింద ఎకరానికి రూ.6,880 వర్షాధార పంటలకు రూ.3,440 తోటల పంటలకు రూ.9,106 చొప్పున పరిహారం ఇవ్వాల్సి వస్తుందని వివరించారు. ఇలా మొత్తం రూ.70 కోట్ల పరిహారం రైతులకు అందించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. గతంలో తుపాన్ల సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం రాలేదని, అయితే ఈసారి తుపాను నష్టాల నివేదికను దిల్లీకి పంపి కేంద్ర సాయం కోరుతామన్నారు.

Details

ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం

వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో ప్రతేడాది 2 లక్షల ఎకరాల చొప్పున మొత్తం 8 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయిల్‌పామ్‌ ప్రగతిపై మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రస్తుతం రాష్ట్రంలో 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు జరుగుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఎకరాల లక్ష్యం నిర్దేశించామని చెప్పారు. అయితే ఇప్పటివరకు 31,158 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయిందని, మార్చి నాటికి మిగతా లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు.

Details

ఆయిల్‌పామ్‌ సాగుకు ఒప్పందం

వరంగల్, నారాయణపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు లక్ష్యాలను చేరుకోలేదని పేర్కొన్నారు. ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సంవత్సరానికి ముందే ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక ఆయిల్‌ పామ్‌ శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.