Montha Cyclone: నరసాపురం వద్ద తీరం దాటిన 'మొంథా' తుపాను: ప్రకటించిన ఐఎండీ
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ను వణికించిన 'మొంథా' తుపాను ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణ దిశగా, నరసాపురం సమీపంలో తుపాను భూమిని తాకినట్లు భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి బుధవారం ఉదయం 12.30 వరకు తీరం దాటే ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. తుపాను భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ, తీవ్రత తగ్గకుండా భూభాగంపైనే మరికొంత సేపు శక్తివంతంగా కొనసాగనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీరం దాటే సమయానికి తుపాను గంటకు సుమారు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది.
వివరాలు
నెల్లూరు జిల్లా కావలిలో అత్యధిక వర్షపాతం నమోదు
అనంతరం ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తెలంగాణ మీదుగా ప్రయాణించి,బుధవారం మధ్యాహ్నానికి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మరింత బలహీనపడే అవకాశం ఉందని అంచనా. తుపాను ప్రభావంతో గాలులు ఇప్పటికీ ఉధృతంగా వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 85 నుండి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కొనసాగుతున్నాయి. గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలి అత్యధిక వర్షపాతం నమోదు చేసింది. అక్కడ 23 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ఉలవపాడు 17 సెం.మీ., చీరాల 15 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి. తుపాను తీవ్రత దృష్ట్యా బుధవారం కోస్తా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
వివరాలు
ఈ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
తుపాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ముఖ్యంగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.