LOADING...
Chandrababu: మొంథా తుపాను ప్రభావం.. ఏపీకి రూ. 5,265 కోట్లు ప్రాథమిక నష్టం అంచనా వేసిన ప్రభుత్వం 
Chandrababu: ఏపీకి రూ. 5,265 కోట్లు ప్రాథమిక నష్టం అంచనా వేసిన ప్రభుత్వం

Chandrababu: మొంథా తుపాను ప్రభావం.. ఏపీకి రూ. 5,265 కోట్లు ప్రాథమిక నష్టం అంచనా వేసిన ప్రభుత్వం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మొంథా తుపాన్' కారణంగా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వ్యవసాయ రంగం రూ.829 కోట్ల నష్టాన్ని,రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) సుమారు రూ.2,079 కోట్ల నష్టం ఎదుర్కొన్నట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. తుఫాను సమయంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సీఎం పేర్కొంటూ, 120 పశువులు మృతి చెందాయి అని తెలిపారు. నీటిపారుదల శాఖకు ఈసారి పెద్ద నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తుఫాను ప్రభావం, నష్టం వివరాలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించగా, సంబంధిత అధికారులు వివరణాత్మక నివేదికను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు,''మొంథా తుఫాను తీవ్రతను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకున్నందువల్లే నష్టం తగ్గిందన్నారు.

వివరాలు 

3 గంటల్లోనే విద్యుత్

"ప్రతి ఇంటిని, కుటుంబాన్ని జియోట్యాగ్‌ చేయడం ద్వారా పరిస్థితులను నిశితంగా గమనించగలిగాం. తుఫాను మార్పుల్ని అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకున్నాం. గతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయితే పునరుద్ధరణకు 10 గంటలు పట్టేది, కానీ ఇప్పుడు 3 గంటల్లోనే విద్యుత్‌ను తిరిగి అందించగలిగాం. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేశారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం కురుస్తున్నప్పటికీ, కూలిన చెట్లను వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో అలాంటి పరిస్థితుల్లో చెట్లను తొలగించడానికి వారం రోజులు పట్టేది. ప్రకృతి విపత్తులను ఆపడం సాధ్యం కాదు, కానీ ముందస్తు చర్యలతో నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు'' అని చంద్రబాబు తెలిపారు.