LOADING...
Cyclone Montha: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం.. నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనున్న మొంథా 
నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనున్న మొంథా

Cyclone Montha: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం.. నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనున్న మొంథా 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
07:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం ఇప్పుడు 'మొంథా తుపాన్' గా మారి కోస్తా జిల్లాలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే విశాఖపట్టణం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ వాయుగుండం బలపడుతూ తుపానుగా మారింది. సోమవారం సాయంత్రం నాటికి ఇది చెన్నైకి 420 కి.మీ., కాకినాడకు 450 కి.మీ., విశాఖకు 500 కి.మీ., గోపాల్‌పూర్‌ (ఒడిశా)కు 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయవ్య దిశలో కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. అలాగే, మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

అప్రమత్తమైన ప్రభుత్వం 

తీరాన్ని తాకిన తర్వాత దాదాపు 18 గంటలపాటు దీని తీవ్రత కొనసాగి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 110 కి.మీ. వరకు గాలులు, ఇతర ప్రాంతాల్లో గంటకు 90 కి.మీ. వరకు గాలివానలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హై అలర్ట్‌లోకి వెళ్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. గాలివానల కారణంగా విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడే ప్రమాదం ఉండటంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం 1,000 బృందాల్లో 12,000 మంది సిబ్బందిని సిద్ధం చేశారు.

వివరాలు 

రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు 

ఏ ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుపాను నిర్వహణకు అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేయాలనే బాధ్యతను మంత్రి నారా లోకేశ్‌కు అప్పగించారు. పంట నష్టం జరగకుండా ఉండేందుకు రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో 2,194 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోనసీమ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజల తరలింపు ప్రారంభమైంది. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూంలు ప్రారంభమయ్యాయి. ప్రభావిత 12 జిల్లాల్లో రేషన్ సరఫరాను ముందుగానే ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

వివరాలు 

ఇప్పటికే మొదలైన తుపాను ప్రభావం 

దక్షిణ మధ్య రైల్వే మంగళవారం విజయవాడ, విశాఖ మార్గాల్లో పలు రైళ్లు రద్దు చేసింది. రద్దైన రైళ్ల వివరాలు వెబ్‌సైట్లో ఉంచగా, ప్రయాణికులకు SMS ద్వారా సమాచారం అందిస్తున్నారు. అలాగే విజయవాడ, విశాఖ విమానాశ్రయాల నుంచి కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. సోమవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావం కనిపించింది. కాకినాడతో పాటు కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఎండ కనిపించినా, త్వరలోనే జల్లులు మొదలయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య విశాఖపట్నం రూరల్‌లో 94 మి.మీ., అనంతపురం జిల్లా ఉరవకొండలో 84 మి.మీ. వర్షపాతం నమోదైంది.

వివరాలు 

పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు 

ఐఎండీ పలు జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' అలర్ట్ జారీ చేసింది. వీటిలో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. పోర్టులకు హెచ్చరికలు తీర ప్రాంత సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున మత్స్యకారులు శుక్రవారం వరకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తిరిగి తీరానికి చేరాలని సూచించారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు నాలుగో నంబరు ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

భారీ వర్షాలు కురిసే జిల్లాలు 

మంగళవారం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతోపాటు యానాంలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు; చిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు ఉండొచ్చని ఐఎండీ తెలిపింది.

వివరాలు 

20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం అవకాశం 

బుధవారం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవవచ్చు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కూడా అధిక వర్షాలు కురవవచ్చని అంచనా. గురువారం: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపారు. మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో గురువారం కూడా కొన్ని చోట్ల వర్షాలు కొనసాగుతాయని అంచనా. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

వివరాలు 

విపత్తు నిర్వహణ సన్నాహాలు 

మంగళవారం 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బుధవారం 8జిల్లాలకు రెడ్,9 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం,తుపాను ప్రభావం 1,419గ్రామాలు, 44పట్టణ ప్రాంతాలు దాకా ఉండొచ్చు. ఇప్పటికే 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని సంస్థ అధికారి ఎం.వి. ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాక, జిల్లా స్థాయిలో 19, రెవెన్యూ డివిజన్లలో 54, మండల-గ్రామ స్థాయిలో 484సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమ్యూనికేషన్ కోసం 16శాటిలైట్ ఫోన్లు,35 డీఎంఆర్ సెట్లు సిద్ధంగా ఉంచారు. అదనంగా 11 ఎన్డీఆర్‌ఎఫ్, 13 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు తుపాను ప్రభావిత జిల్లాలకు పంపినట్లు వెల్లడించారు.