Cyclone Montha: ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించిన మొంథా తుఫాన్..
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీని వణికించిన 'మొంథా తుపాన్' ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఎంటర్ అయ్యింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అది దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర అల్పపీడనంగా మారి ప్రవేశించింది. దీని ప్రభావంతో ఆ రాష్ట్రంతో పాటు ఒడిశా ప్రాంతాల్లో కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో,ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. 'మొంథా' ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించగా, పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో చెట్టు కూలి ఒకరు ప్రాణాలు కోల్పోగా,ఖమ్మం జిల్లాలో డీసీఎం వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది.
వివరాలు
హంటర్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి
ముఖ్యంగా వరంగల్ ప్రాంతం మొత్తం వర్షం కారణంగా అతలాకుతలమైంది. బుధవారం తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీవానతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు నీట మునిగిపోవడంతో మోకాళ్ల లోతు వరద రహదారులపై నిలిచిపోయింది. హంటర్ రోడ్డులో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ములుగు రోడ్, హనుమకొండ చౌరస్తా, బస్‌స్టాండ్ రోడ్, అంబేద్కర్ జంక్షన్, వరంగల్ అండర్‌బ్రిడ్జి, చిన్నబ్రిడ్జి, పాతబీటు బజార్, బట్టల బజార్, ఆర్టీఏ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు కాజ్‌వే మీదుగా వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వివరాలు
తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు జలమయమయ్యాయి
డోర్నకల్ పట్టణంలో కురిసిన భారీవాన కారణంగా రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రైళ్లు నిలిచిపోయాయి. మరోవైపు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో లింగాలగట్టు వద్ద, అలాగే అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండచరియలు జారిపడటంతో రహదారులు దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్, అచ్చంపేట పట్టణాల్లో తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు జలమయమయ్యాయి. దుందుభీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. డిండి ప్రాజెక్టు వద్ద కల్వర్టు కూలిపోవడంతో శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా ఆగిపోయాయి.
వివరాలు
రంగారెడ్డి జిల్లాలో అనేక చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి
కొత్తగూడెం పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనుల్లో జీవీఆర్, కిష్టారం ఓసీలలో సుమారు 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ నీటిలో కొట్టుకుపోయి డ్రైవర్ గల్లంతయ్యాడు. రంగారెడ్డి జిల్లాలో అనేక చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్, తొర్రూరు గ్రామాల మధ్య వరద తీవ్రతతో ఒక కారు నీట మునిగిపోయింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య కాగ్నా వాగులో కొట్టుకుపోతుండగా, తాండూర్ మండలం వీర్‌శెట్టిపల్లి వద్ద బ్రిడ్జి దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు తాళ్ల సాయంతో అతన్ని రక్షించారు.
వివరాలు
తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మెపల్లిలోని బాలుర గిరిజన పాఠశాల చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని వర్షపు నీరు చుట్టుముట్టడంతో విద్యార్థినులు భయంతో గడిపారు.