Cyclone Montha: మోంథా తుపానుపై ఆందోళన.. కళ్ల ముందు కదలాడుతున్న 1996 విలయం
ఈ వార్తాకథనం ఏంటి
మోంథా తుపాను కారణంగా కాకినాడ జిల్లా ప్రజల్లో భయం అలుముకుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపానుగా మారి, కాకినాడ తీరాన్ని తాకబోతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ తుపాను తీరం దాటే సమయానికి గంటకు సుమారు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో 1996లో సంభవించిన భయంకర తుపాను జ్ఞాపకాలు మళ్లీ ప్రజల మనసుల్లో తళుక్కుమంటున్నాయి.
ప్రళయం
1996 ప్రళయం - మరచిపోలేని విపత్తు
1996 నవంబర్ 6న కాకినాడ-యానాం మధ్య తీరం దాటిన తుపాను కోనసీమ ప్రాంతాన్ని బీభత్సంగా తాకింది. గంటకు 215 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఆ ప్రాంతాన్ని చిదిమేశాయి. సముద్ర అలలు ఉధృతంగా ఎగసి, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని తీర మత్స్యకార గ్రామాలను నీట ముంచాయి. ముఖ్యంగా కాట్రేనికోన మండలంలోని భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాలు పూర్తిగా అంతరించిపోయాయి.
ఆస్తి
భారీగా ప్రాణ,ఆస్తి నష్టం
అధికార లెక్కల ప్రకారం, ఆ తుపాను ధాటికి 1,077 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 2.25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 6.47 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి, వాటిలో 40 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వేలాది పశువులు, మూగజీవులు మృతి చెందగా, 5.97 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. 20 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి. దాదాపు మూడు దశాబ్దాలు గడిచినా, ఆ తుపానుతో ఏర్పడిన విషాదం ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో ఇంకా చెరిగిపోలేదు.
అప్రమత్తం
అప్రమత్తంగా అధికార యంత్రాంగం
నాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం కాకినాడ జిల్లా అధికారులు మోంథా తుపాను నేపథ్యంలో పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ రోడ్డును ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా ఆపారు. రైతులు కూడా పొలం పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు.
అప్రమత్తం
అప్రమత్తంగా అధికార యంత్రాంగం
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ శణ్మోహన్ సగిలి, జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ (Krishna Teja Mylavarapu) పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించగా, వైద్య సేవలను కూడా విస్తృతంగా అందిస్తున్నారు.