
Cyclone Shakti: అరేబియా తీరంలో తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న 'శక్తి'..
ఈ వార్తాకథనం ఏంటి
'సైక్లోన్ శక్తి' ముంచుకొస్తోంది. ఇది 2025లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను అని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఈశాన్య దిశలో ద్వారకాకు సుమారు 240 కి.మీ, పోర్బందర్‌కు సుమారు 270 కి.మీ దూరంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది వేగంగా బలపడుతూ గరిష్టంగా గంటకు 12 కిమీ వేగంతో పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతోంది. అంచనాల ప్రకారం ఇది వచ్చే మూడు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారవచ్చు. ఈ తుఫాను "సైక్లోన్ శక్తి"గా పిలుస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం, హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని 13 దేశాలు తుఫాన్లకు పేర్లు నిర్ణయిస్తాయి.
వివరాలు
13దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి
అందులో భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మియన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ, యెమెన్ ఉన్నాయి. కొన్ని తుఫాన్ల ప్రభావం ఒక వారం లేదా అంతకన్నా ఎక్కువ కాలం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరుసటి తుఫానును గుర్తించడానికి, అప్రమత్తం చేసేందుకు ప్రతి తుఫానుకి ప్రత్యేకంగా పేరు ఇవ్వడం ప్రారంభించబడింది. ఈసారి "శక్తి" అనే పేరు శ్రీలంక దేశం ప్రతిపాదించింది. తుఫానులకు ప్రత్యేకంగా పేర్లు ఇవ్వడం వల్ల విపత్తు నిర్వహణ, మీడియా, సాధారణ ప్రజలందరికీ ఆ తుఫానును గుర్తించడంలో సులభం అవుతుంది. ఇది ప్రజలకు అప్రమత్తం అవ్వడానికి తోడ్పడుతుంది. పేర్లు సాధారణంగా చిన్నవిగా, సులభంగా పలికే విధంగా ఉండేలా నియమాలు ఉన్నాయి.
వివరాలు
ఎవరు నిర్ణయిస్తారంటే..?
పేర్లను ఎవరు నిర్ణయిస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, నాలుగు ఉష్ణమండల తుఫాను హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో భారత వాతావరణ శాఖ కూడా ఒకటి. ఇది ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతంలో గరిష్టంగా గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీచే తుఫాన్లకు పేర్లు ఇస్తుంది. అక్షర క్రమంలో ప్రతి సభ్య దేశం ఒక తుఫానుకు పేరు సూచిస్తుంది. ప్రతి పేరు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి, అక్షరాల పరిమాణం 8 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, అది ఏ దేశం లేదా వర్గం ప్రజల భావోద్వేగాలకు ప్రతికూలంగా ఉండకూడదు.