LOADING...
Cyclone: ఏపీకి వాయుగుండం ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
ఏపీకి వాయుగుండం ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

Cyclone: ఏపీకి వాయుగుండం ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముండటంతో, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికను, మరికొన్ని జిల్లాలకు 'ఎల్లో' అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ, బుధవారం ఉదయానికి నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో.. దక్షిణ ఆంధ్రా తీరానికి, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా.. వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

పిడుగులతో కూడిన వర్షాలు 

తదుపరి 24 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇదే సమయంలో, దక్షిణ బంగాళాఖాతంలో శుక్రవారం లేదా శనివారం మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కూడా వాతావరణ మోడళ్లు సూచిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ బుధవారానికి వాయుగుండంగా మారవచ్చని ఐఎండీ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం,రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల సమాచారం ప్రకారం, రాబోయే ఐదు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శుక్రవారం నుండి ఆదివారం వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా.

వివరాలు 

ప్రభావిత జిల్లాలు 

బుధవారం నాడు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. అలాగే బాపట్ల, ప్రకాశం, నంద్యాల,కర్నూలు,అనంతపురం,శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు. దక్షిణ తీర ప్రాంతాల్లో గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో,శనివారం వరకు మత్స్యకారులు సముద్ర యాత్రలు చేయవద్దని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం,ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం సంస్థ కంట్రోల్‌రూమ్ నంబర్లైన 112,1070,1800-425-0101 లకు సంప్రదించాలని సూచించారు.