Loading...
AP Rains: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అలర్ట్!
ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అలర్ట్!

AP Rains: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అలర్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీలో వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రాష్ట్రానికి తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తోంది. ఈ నెల 22, 23 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

వివరాలు

వాయుగుండంగా బలపడే అవకాశం

ఈ అల్పపీడనం క్రమంగా బలపడి.. మూడు నుంచి నాలుగు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత IMD అంచనాల ప్రకారం కూడా ఉత్తర అండమాన్‌ సముద్రం పరిసరాల్లో సెప్టెంబర్‌ 19న అల్పపీడనం ఏర్పడి, అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.

ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈ నెల 21న మధ్యాహ్నం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వివరాలు

తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం

అనంతరం 22న తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అల్పపీడనం తుఫాన్‌గా మారితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో ఈ నెల 22, 23 తేదీల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజా IMD హెచ్చరికల్లోనూ కోస్తాంధ్రకు సెప్టెంబర్‌ 23న భారీ వర్షాల హెచ్చరిక ఉంది.

ADVERTISEMENT

వివరాలు

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

ఇదిలా ఉండగా.. ఇవాళ (శనివారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT