LOADING...
African snails: భాగ్యనగరాన్ని కలవరపెడుతున్న ఆఫ్రికన్‌ నత్తలు.. దాడి చేస్తే వృక్షాలూ నేలకొరగాల్సిందే! 
దాడి చేస్తే వృక్షాలూ నేలకొరగాల్సిందే!

African snails: భాగ్యనగరాన్ని కలవరపెడుతున్న ఆఫ్రికన్‌ నత్తలు.. దాడి చేస్తే వృక్షాలూ నేలకొరగాల్సిందే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎక్కడి నుంచి చేరాయో, ఎలా వ్యాపించాయో స్పష్టంగా తెలియకుండానే ఈ నత్తలు గుంపు గుంపులుగా చేరి పచ్చదనాన్ని మింగేస్తున్నాయి. ఇవి విస్తరించడం ఆపడానికి ఏం చేయాలో తెలియక పాలనాధికారులు కూడా సందిగ్ధంలో పడిపోయారు. ఈ చీడపురుగుల పేరు.. ఆఫ్రికన్‌ నత్తలు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని న్యూబోయిన్‌పల్లిలో మిలిటరీకు చెందిన సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని ప్రాంతంలో ఈ ఆఫ్రికన్‌ నత్తలు పెరిగిపోతున్నాయన్న సమాచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇవి కేవలం ఆకులు,చిగుళ్లు, కాండం, పూతపిందెలనే కాకుండా ఏకంగా వృక్షాలే నేలకొరిగేలా చేస్తాయి. ఇవి హైదరాబాద్ అంతటా వ్యాపిస్తే,ఇళ్లలో పెంచుకునే చిన్న మొక్కలనుంచి పార్కుల్లోని చెట్ల వరకూ పచ్చదనం మిగలదని ప్రజలు భయపడడం సహజమే. అందువల్ల ముందుగానే చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

జీవితకాలం, సంతానం ఎక్కువే..! 

ఆఫ్రికన్‌ నత్తలు ముఖ్యంగా కేరళలో విస్తారంగా కనిపిస్తాయి. వీటి ఆయుష్షు సుమారు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటుంది. ఒక్క నత్త నెలకు వందల సంఖ్యలో గుడ్లు పెట్టగలదు. దీంతో చాలా వేగంగా ఇవి పెరుగుతాయి. కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతులు కూడా వీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా బొప్పాయి, ఆయిల్‌పామ్‌, మిరప వంటి పంటలు పూర్తిగా నాశనం కాగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. తరువాత నిపుణుల మార్గదర్శకత్వంలో ఉప్పు ద్రావణం, కాపర్‌ సల్ఫేట్‌, స్నెయిల్‌ కిల్లర్‌ వంటి మందులను పిచికారీ చేయడం ద్వారా వాటిని నియంత్రణలోకి తెచ్చారు.