Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. జమ్ముకశ్మీర్‌లో ఈసీ అధికారులు బృందం సోమవారం నుంచి బుధవారం వరకు పర్యటించనుంది. ఆ తర్వాత భారత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు ఎన్డీటీవీకి తెలిపాయి. సెప్టెంబరులోగా కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈసీ బృందం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది. అయితే జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి రానుంది.
జమ్ముకశ్మీర్‌లో 2014లో చివరి సారిగా అసెంబ్లీ ఎన్నికలు
జమ్ముకశ్మీర్‌లో చివరి సారిగా అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. 2019లో ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయబడిన తర్వాత రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు విభజించారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్‌లో జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని ఆదేశించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం 2018లో కూలిపోయింది. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు.