Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన దావూద్ భూములు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న దావూద్ కుటుంబానికి చెందిన నాలుగు వ్యవసాయ భూములను ముంబైకు చెందిన ఒక వ్యక్తి అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వేలం వివరాలు రత్నగిరి జిల్లా ముంబాక్ గ్రామంలో ఉన్న ఈ నాలుగు ప్లాట్లు గతంలో దావూద్ తల్లి అమీనా బీ పేరిట నమోదై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 'స్మగ్లర్లు & విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల (ఆస్తి జప్తు) చట్టం' కింద 2026మార్చి 5న ఈ వేలాన్ని నిర్వహించింది. అత్యధిక బిడ్ వేసిన వ్యక్తి 2026 ఏప్రిల్ తొలి వారంలోగా మొత్తం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.
Details
ఒకే వ్యక్తికి మూడు ప్లాట్లు
నిధులు జమ అయిన తర్వాత సంబంధిత అధికారుల తుది ఆమోదంతో ఆస్తి బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ వేలంలో ముఖ్యంగా సర్వే నెం. 442 (పార్ట్ 13-బి) ప్లాట్‌పై ప్రత్యేక చర్చ జరిగింది. దీనికి రిజర్వ్ ధర సుమారు రూ.9.41 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో ఇది రూ.10 లక్షలకు పైగా చేరింది. ఈ ప్లాట్ కోసం ముంబై, రత్నగిరి ప్రాంతాలకు చెందిన ఇద్దరు బిడ్డర్లు పోటీ పడగా, మిగిలిన మూడు ప్లాట్లను ఒకే వ్యక్తి దక్కించుకున్నారు.
Details
ఇన్నాళ్లుగా ఎందుకు అమ్ముడవలేదంటే
దావూద్ ఆస్తులను వేలం వేయడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవి పదేపదే విఫలమయ్యాయి. దావూద్ ఇబ్రహీం, అతని ముఠా అయిన డీ-కంపెనీ భయంతో కొనుగోలుదారులు ముందుకు రావడానికి వెనుకంజ వేశారు. 2025 నవంబర్‌లో ప్రభుత్వం ధరను 30 శాతం తగ్గించినప్పటికీ కొనుగోలుదారుల ఆసక్తి కనిపించలేదు. అదేవిధంగా ఈ భూములు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం, కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగపడటం వల్ల తక్షణ ఆర్థిక లాభం ఉండదని భావించారు. అయినప్పటికీ, ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరికి ఈ ఆస్తుల వేలం విజయవంతంగా పూర్తవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.