Uttarakhand: 140 గంటలుగా సొరంగంలోనే కార్మికులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్‌లో సొరంగం ఆదివారం కూలిపోయి అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్మికులను రక్షించేందుకు గత ఏడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో దాదాపు 140 గంటలుగా ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోపల వారు ఎలా ఉన్నారనేది ఇంకా తెలియదు. దీంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, టన్నెల్‌కు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు శుక్రవారం అర్థరాత్రి మిషన్‌పై శిథిలాలు పడిపోవడంతో ఆపరేషన్ ను అధికారులు నిలిపివేశారు. శనివారం ఉదయం రెస్క్యూ పని తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు. కార్మికులను రక్షించేందుకు డ్రిల్లింగ్‌ను వేగవంతం చేయాల్సి ఉంటుందని, అమెరికన్ ఆగర్ మెషిన్ ఊహించిన దాని కంటే నెమ్మదిగా పని చేస్తోందని అధికారులు అంటున్నారు.
22మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి
కార్మికులు 60 మీటర్ల శిథిలాల వెనుక చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. కార్మికులతో పైపుల ద్వారా కమ్యూనికేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సొరంగంలో కేవలం 4 పైపులు మాత్రమే పంపారు. అంటే, 22 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. రెస్క్యూ బృందం ఇప్పుడు చేస్తున్న సమాంతర డ్రిల్లింగ్ విజయవంతం కాకపోతే.. సొరంగం పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేసే అవకాశాన్ని రెస్క్యూ బృందం పరిశీలిస్తోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌లతో సహా పలు ఏజెన్సీలకు చెందిన 165 మంది సిబ్బంది 24గంటలు రెస్య్కూ ఆపరేషన్ చేస్తున్నట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది.