EY Employee Death: పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణం.. నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్
ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కార్పొరేట్ రంగంలో ఉన్న పని ఒత్తిడి కారణంగానే అమె మరణించినట్లు సమాచారం. ఇక తన కూతురు పని ఒత్తిడితోనే ప్రాణాలు కోల్పోయిందని అన్నా తల్లి ఆరోపించింది. దీంతో ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్పొరేట్ కల్చర్‌పై వివిధ ప్రశ్నలు రేకెత్తించాయి. ఆఫీసులో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నా మరణించింది.
దేశవ్యాప్తంగా కార్పొరేట్ కల్చర్‌పై ప్రశ్నలు
ఆమె తల్లిదండ్రులు, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కూడా పని చేసేదని, తినడానికి, నిద్ర పోవడానికి కూడా సమయం దొరికేది కాదని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కార్పొరేట్ ఉద్యోగాల ఒత్తిడిపై, ఉద్యోగుల సంక్షేమంపై దేశవ్యాప్తంగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఆమె మరణం కారణంగా ఉద్యోగులు తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. పని ఒత్తిడి, లైంగిక వేధింపులు, మానసిక సమస్యలు వంటి అనేక అంశాలను పలువురు ఉద్యోగులు వెలుగులోకి తీసుకొచ్చారు.