
Cough Syrup Tragedy: కోల్డ్‌రిఫ్ దగ్గుమందుతో మరణాలు.. ఆ ఫార్మా కంపెనీ మూసివేత!
ఈ వార్తాకథనం ఏంటి
'కోల్డ్‌రిఫ్' దగ్గుమందు (Cough Syrup Row) వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై చర్య తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం, ఆ మందు తయారు చేసిన శ్రేసన్ ఫార్మా కంపెనీకి ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసింది. అలాగే సంస్థను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సోమవారం ప్రకటించింది. అదనంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఇతర ఔషధ తయారీ సంస్థలపై తనిఖీలు నిర్వహించాలని కూడా ఆదేశించింది. కోల్డ్‌రిఫ్ దగ్గుమందును తయారు చేసిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. చిన్నారుల మరణాల నేపథ్యంలో అక్కడ జరిగిన తనిఖీల్లో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Details
కంపెనీ యజమాని అరెస్టు
సిరప్‌లో 48.6 శాతం విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని అధికారులు నిర్ధారించారు. అదీ తగిన తయారీ ప్రమాణాలు పాటించకుండా తయారు చేశారని గుర్తించారు. కంపెనీ కార్యకలాపాల్లో 300కు పైగా నియమావళి ఉల్లంఘనలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కంపెనీ యజమాని జి. రంగనాథన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఇదే కేసులో ఈడీ కూడా ఈరోజు ఉదయం సంస్థకు చెందిన పలు ప్రాంగణాల్లో దాడులు నిర్వహించింది. చిన్నారుల మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తు సమయంలో కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Details
సకాలంలో చర్యలు తీసుకోలేదు
రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ కీలక నిబంధనలను పట్టించుకోలేదని, కేంద్రం చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ప్రస్తావించాయి. దగ్గుమందు తయారీ ప్రక్రియపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్లే విషపూరితమైన సిరప్ (Poisonous Syrup) మార్కెట్లోకి చేరి పిల్లల మరణాలకు దారి తీసిందని నివేదికలు వెల్లడించాయి.