Loading...
Tirupati Railway Projects: దశాబ్దాల నిరీక్షణ.. పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు
దశాబ్దాల నిరీక్షణ.. పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు

Tirupati Railway Projects: దశాబ్దాల నిరీక్షణ.. పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రేణిగుంట జంక్షన్‌పై రైళ్ల రద్దీ రోజురోజుకూ అధికమవుతోంది. మరోవైపు కోస్తా తీరంలో తుపాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో దశాబ్దాల క్రితమే పలు రైల్వే ప్రాజెక్టులను ప్రతిపాదించారు. అయితే, కీలకమైన అటవీ అనుమతులు, వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియలు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంతో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఫ లితంగా, జిల్లాలో చేపట్టాల్సిన కీలక రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు.

వివరాలు

ప్రత్యామ్నాయ మార్గంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్

1996లో చెన్నై-కోల్‌కతా రైల్వే మార్గంలో ఉలవపాడు సమీపంలో రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయింది.

కోస్తా ప్రాంతంలో తుపాన్ల కారణంగా ప్రధాన రైల్వే మార్గానికి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించారు.

సుమారు 309 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుకు దాదాపు మూడు దశాబ్దాల క్రితమే రూపకల్పన చేశారు. ఈ మార్గంలో పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 53 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ నిర్మాణం పూర్తయి, రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి.

కనిగిరి దాటి పామూరు వైపు పనులు కొనసాగుతున్నాయి. అయితే, తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఆత్మకూరు-రాపూరు-వెంకటగిరి-శ్రీకాళహస్తి సెక్షన్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది.

సుమారు 110 కిలోమీటర్ల పొడవైన ఈ విభాగంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

వివరాలు

రేణిగుంట రద్దీ తగ్గించే 'ఏర్పేడు-పూడి' బైపాస్

దీంతో మొత్తం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం ఆలస్యమవుతోంది. రేణిగుంట రైల్వే జంక్షన్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు సుమారు 20 ఏళ్ల క్రితం ఏర్పేడు-పూడి బైపాస్‌ ప్రాజెక్టును ప్రతిపాదించారు.

దాదాపు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో 25.36 కిలోమీటర్ల పొడవున ఈ మార్గాన్ని నిర్మించాలనేది ప్రణాళిక. గూడూరు నుంచి చెన్నై, కాట్పాడి వైపు వెళ్లే గూడ్స్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రేణిగుంట జంక్షన్‌లోకి రాకుండానే ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించడం ఈ బైపాస్‌ ప్రధాన ఉద్దేశం.

దీనివల్ల రేణిగుంటలో రైళ్ల క్రాసింగ్‌ కోసం తిరుమలకు వచ్చే భక్తుల రైళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి తగ్గే అవకాశం ఉంది.

జంక్షన్‌పై రద్దీ తగ్గడంతో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కావచ్చని భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

గ్రామాల్లో భూసేకరణకు చర్యలు

దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఏర్పేడు మండల పరిధిలోని పుత్తూరు, చెల్లూరు, మునగలపాలెం, కొబాక తదితర గ్రామాల్లో భూముల సేకరణకు చర్యలు ఊపందుకున్నాయి.

బైపాస్‌ నిర్మాణం పూర్తయితే రైల్వే రవాణాకు మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగానికీ ప్రయోజనం చేకూరనుంది. రాయలసీమ ప్రాంతంలో పండించే మామిడి, చీనీ, అరటి, బొప్పాయి, టమాట వంటి పంటలను ఇతర ప్రాంతాలకు తరలించడం సులభతరం కానుంది.

తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణాకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ప్రాజెక్టుల జాప్యానికి ప్రధాన కారణాలివే!

ఈ రైల్వే మార్గాల నిర్మాణానికి సుమారు 5,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. భూములు కోల్పోయే రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణకు సంబంధించిన ప్రక్రియలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి.

పరిహారం విషయంలో పరిష్కారాలు లభించకపోవడం, భూముల సేకరణలో ఎదురవుతున్న సమస్యలు ప్రాజెక్టుల పురోగతిని ప్రభావితం చేస్తున్నాయి.

మరోవైపు ప్రతిపాదిత రైల్వే లైన్‌ శేషాచలం అటవీ ప్రాంతాలు, రాపూరు అభయారణ్యంలోని కొన్ని భాగాల మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందడం కీలకంగా మారింది.

అటవీ భూముల వినియోగానికి సంబంధించిన క్లియరెన్సులు రావడానికి ఏళ్ల సమయం పడుతుండటంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.

వివరాలు

అటవీ అనుమతుల సమస్యలను పరిష్కరించుకోవాలి

అంతేకాకుండా, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌లోని శ్రీకాళహస్తి సెక్షన్‌ పూర్తయితేనే ఏర్పేడు-పూడి బైపాస్‌ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరనుంది.

ఒక ప్రాజెక్టు పురోగతి మరో ప్రాజెక్టు వినియోగంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

దశాబ్దాల క్రితమే ప్రతిపాదించిన ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే రేణిగుంట జంక్షన్‌పై రద్దీ తగ్గడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రత్యామ్నాయ రైలు మార్గాలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ, పారిశ్రామిక సరుకుల రవాణాకూ ఊతం లభిస్తుంది.

అయితే కీలకమైన అనుమతులు, భూసేకరణ ప్రక్రియలు ఎప్పటికి పూర్తవుతాయి? ఈ ప్రాజెక్టులు ఎప్పటికి పట్టాలెక్కుతాయి? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మిగిలింది.

ADVERTISEMENT