AP Govt: బధిర విద్యార్థులకు శుభవార్త.. బాపట్ల జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
బధిర విద్యార్థుల ఉన్నత విద్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల,జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా ఉన్నతీకరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి లభించింది. డిగ్రీ తరగతుల నిర్వహణ కోసం తాత్కాలికంగా భవనాన్ని సిద్ధం చేసే పనులు చేపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో వెదుళ్లపల్లి బధిరుల ఆశ్రమాన్ని డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీ అమలులోకి వచ్చింది.
వివరాలు
1987లో తొలి బధిరుల ఆశ్రమ పాఠశాల
వెదుళ్లపల్లిలోని ఈ బధిరుల ఆశ్రమ పాఠశాలకు ప్రత్యేక చరిత్ర ఉంది.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి బధిరుల ఆశ్రమ పాఠశాలను బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో 14ఎకరాల విస్తీర్ణంలో స్థాపించారు.
అప్పటి నుంచి బధిర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.
తర్వాత 1999లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఈ ఆశ్రమ పాఠశాలకు జూనియర్ కళాశాల హోదా కల్పించారు.
ప్రస్తుతం ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 140మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఇప్పుడు డిగ్రీ కళాశాల హోదా రావడంతో బధిర విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
వివరాలు
ఆశ్రమ జూనియర్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు
అదే ప్రాంగణంలో డిగ్రీ చదివే అవకాశం కలగడంతో ఉపాధి అవకాశాలను మరింత సులభంగా అందిపుచ్చుకునే వీలు ఏర్పడనుంది.
ప్రస్తుతం ఆశ్రమ జూనియర్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు పనిచేస్తున్నారు.
ఇప్పటివరకు హెచ్‌ఈసీ గ్రూపు మాత్రమే అందుబాటులో ఉండగా,డిగ్రీ కళాశాలలో బీఎస్సీ,బీఏ,బీకాం కోర్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
తొలి ఏడాదిలో ప్రతి కోర్సుకు 25 నుంచి 30 సీట్ల చొప్పున కేటాయించనున్నారు.
వివరాలు
డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం కోసం రూ.18 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు
ఈ లెక్కన మూడు కోర్సుల్లో కలిపి 75 నుంచి 90 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది.
బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజియా మాట్లాడుతూ,డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం కోసం రూ.18 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
ఉన్నతాధికారుల నుంచి అధికారిక ఆదేశాలు అందిన వెంటనే ప్రవేశ ప్రక్రియ ప్రారంభించి, డిగ్రీ తరగతులను ప్రారంభిస్తామని వెల్లడించారు.