 
                                                                                Delhi Acid Attack: ఢిల్లీ యాసిడ్ దాడిలో బిగ్ ట్విస్ట్.. అమ్మాయి తండ్రి ప్లానే!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య, ఆశ్చర్యకరంగా బాధితురాలి తండ్రిపైనే లైంగిక వేధింపులు,బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. గతంలో తన ఉద్యోగ సమయంలో బాధితురాలి తండ్రి తనపై లైంగిక దాడి చేశాడని, ఆ తర్వాత ప్రైవేట్ వీడియోలతో బెదిరింపులు చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీబాయి కాలేజీ దగ్గర మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు.
వివరాలు
యువతికి చేతులపై గాయాలు
వారిలో ప్రధాన నిందితుడు ఇషాన్ యాసిడ్ బాటిల్ తీసుకువచ్చి, అర్మాన్ అనే మరో వ్యక్తి ఆమెలపై ద్రవాన్ని విసిరినట్లు పోలీసులు తెలిపారు. ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో యువతికి చేతులపై గాయాలయ్యాయి. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ముకుంద్‌పూర్ ప్రాంతానికి చెందినవారేనని పోలీసులు వెల్లడించారు. ఇషాన్ గత కొంతకాలంగా బాధితురాలి సోదరిని వేధిస్తున్నాడని, దీనిపై ఆమె గత నెలలో అతడిని ప్రశ్నించిందని బాధితురాలి సోదరుడు మీడియాకు వివరించాడు. దాడి అనంతరం నిందితులు పరారయ్యారని, వారిని పట్టుకునే చర్యలు జరుగుతున్నాయని నార్త్‌వెస్ట్ డీసీపీ భీషమ్ సింగ్ తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, స్వల్ప గాయాలతో కోలుకుంటోందని వైద్యులు పేర్కొన్నారు.
వివరాలు
ఆమె ఆరోపణలను ఖండించిన బాధితురాలి కుటుంబ సభ్యులు
ఈ పరిస్థితుల్లో నిందితుడి భార్య చేసిన ఆరోపణలు కేసును మరింత వివాదాస్పదం చేశాయి. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె ఆరోపణలను ఖండించారు. యాసిడ్ దాడి కేసు దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితురాలి తండ్రి పనిమీద ఊర్లో లేరని కూడా కుటుంబం స్పష్టం చేసింది. పోలీసులు ఇప్పుడు యాసిడ్ దాడి కేసుతో పాటు నిందితుడి భార్య చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై కూడా సమాంతరంగా విచారణ ప్రారంభించారు.
వివరాలు
జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, బాధితురాలికి సరైన వైద్య సహాయం,నష్టపరిహారం కల్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై యాసిడ్ దాడులను సహించబోమని, నిందితులకు కఠిన శిక్షలు విధించాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది.