Delhi: ఢిల్లీ ప్రజలకు సీఎం రేఖా గుప్తా గుడ్ న్యూస్.. పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుభవార్త చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,03,700 కోట్ల భారీ బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రసంగం చేసిన సీఎం, సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ప్రతి కుటుంబానికి ఒక్కో ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.260 కోట్లు కేటాయించారు. దీంతో పండుగల సమయంలో ప్రజలపై ఉండే ఖర్చు భారం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట
ఢిల్లీ అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కోసం రూ.11,666 కోట్లు కేటాయించారు. గతంలో 2018 నుంచి 2020 వరకు ఉచిత పథకాల ప్రభావంతో ఆదాయం తగ్గిందని సీఎం పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ తలసరి ఆదాయం దేశంలో మూడో స్థానానికి చేరిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా సుమారు రూ.74,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
వివరాలు
బడ్జెట్‌లోని ముఖ్య అంశాలు
రవాణా,రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ,పీడబ్ల్యూడీకి రూ.5,921కోట్లు,రోడ్ల నిర్మాణానికి రూ.1,352కోట్లు కేటాయించారు. దాదాపు 750కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. విద్యుత్ రంగానికి రూ.3,942కోట్లు కేటాయించగా,ఓవర్‌హెడ్ వైర్ల తొలగింపుకు రూ.200కోట్లు మంజూరు చేశారు. ఢిల్లీ జల్ బోర్డుకు రూ.9,000కోట్లు కేటాయిస్తూ,ట్యాంకర్లపై ఆధారపడకుండా ప్రతి ఇంటికీ నీటిని అందించడమే లక్ష్యమని తెలిపారు. అగ్నిమాపక వ్యవస్థ బలోపేతానికి రూ.674 కోట్లు కేటాయించారు. యమునా పరిసరాల అభివృద్ధికి రూ.300 కోట్లు, గ్రామీణ వికాస బోర్డుకు రూ.787 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ రూపొందించే ముందు ట్రాన్స్‌జెండర్లు, గిగ్ వర్కర్లు, కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రజలతో చర్చలు జరిపి,వారి సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి ఇది సమగ్ర రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.