LOADING...
Delhi Blast: దిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే అని నిర్ధారణ!
దిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే అని నిర్ధారణ!

Delhi Blast: దిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే అని నిర్ధారణ!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ పేలుడు జరిగిన కారులో లభించిన నమూనాలను పరీక్షించగా, అవి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ (Dr. Umar Un Nabi) డీఎన్‌ఏతో పూర్తిగా సరిపోలినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పేలుడు జరిగే ముందు ఉమర్ ఆ కారును నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో పేలుడు సమయంలో అతడు కూడా వాహనంలో ఉండి ప్రాణాలు కోల్పోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిని నిర్ధారించేందుకు పుల్వామాలోని అతని కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు.

వివరాలు 

 పేలుడు జరిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ 

తాజాగా వచ్చిన ఫలితాలు ఉమర్ నబీదేనని తేలడంతో, పేలుడు జరిగిన సమయానికే అతడు కారు లోపల ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. దిల్లీ పోలీసులు కూడా ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించారు. పేలుడు జరిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అనే అంశం డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తేలిందని వారు తెలిపారు. ఉమర్ తల్లి నుంచి సేకరించిన నమూనాలతో పరీక్షలు జరపగా ఫలితాలు సరిపోయినట్లు పేర్కొన్నారు. పేలుడు అనంతరం అతని కాలు కారు స్టీరింగ్ వీలు, యాక్సిలేటర్ మధ్య ఇరుక్కుపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

ఎర్రకోట సమీపంలో పేలుడు.. 12 మంది దుర్మరణం

సోమవారం దిల్లీ ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు డాక్టర్ ఉమర్ నడిపినదేనని అధికారులు గుర్తించారు. అతనికి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఆ మాడ్యూల్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలను కూడా అధికారులు సేకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.