Delhi Red Fort blast: దిల్లీ పేలుడు కలకలం.. హోంమంత్రి అమిత్ షా అత్యవసర భద్రతా భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
భారీ పేలుడుతో దేశ రాజధాని దిల్లీ వణికిపోయింది. ఈ ఘటనపై మంగళవారం ఉదయం 11 గంటలకు అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరగనుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అధ్యక్షత వహించనున్నారు. కర్తవ్యభవన్‌లో జరగనున్న ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొననున్నారు. అలాగే జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్ వర్చువల్‌గా సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దిల్లీ పేలుడు, ఉగ్రవాద కుట్రలు, కశ్మీర్ ప్రాంతంలోని తాజా పరిణామాలు వంటి అంశాలపై చర్చించనున్నారు.
Details
ఘటనా స్థలాన్ని సందర్శించిన అమిత్ షా
ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అలాగే ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌లతో పరిస్థితిపై సమీక్ష జరిపారు. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ కార్ పేలుడు రాజధానిని షాక్‌కు గురి చేసింది. పేలుడు తీవ్రతకు అనేక వాహనాలు మంటల్లో బుగ్గియ్యాయి. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో రాజధాని సహా దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎర్రకోట మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పేలుడు వెనుక ఉగ్రవాద కోణం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.