Delhi Blast: దిల్లీ బ్లాస్ట్ మిస్టరీ.. ఇంట్లోనే పిండి మరతో పేలుడు పదార్థాల తయారీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ పేలుడు కేసు (Delhi Blast Investigation) దర్యాప్తు వేగం పెరుగుతున్నకొద్దీ ఒక్కొక్కటి ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడుతున్నాయి. నిందితులు బాంబులు, పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అనుసరించిన పద్ధతులు విచారణ అధికారులను విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా పేలుడు పదార్థాల తయారీలో 'పిండి మర'ను కూడా ఉపయోగించినట్టు అధికారులకు తెలిసింది. ప్రధాన నిందితుల్లో ఒకరైన ముజమ్మిల్ షకీల్, పిండి మర సాయంతో యూరియాను రుబ్బి మెత్తగా చేసి, తర్వాత కొన్ని ఎలక్ట్రికల్ మెషీన్లతో దానిని రిఫైన్ చేస్తుండేవాడని దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియ ద్వారా బాంబులు తయారికి అవసరమైన రసాయనాలను సిద్ధం చేసేవాడని అధికారులు తెలిపారు. ఈ సాధనాలు, పరికరాలన్నీ హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ట్యాక్సీ డ్రైవర్ అద్దె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Details
i20 కారుతో ఆత్మాహుతి దాడి
ఇదే ఇంటిలో గతంలో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ కూడా లభ్యమైన విషయం తెలిసిందే. పరిశోధనలో ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన కొడుకును చికిత్స కోసం అల్-ఫలాహ్ మెడికల్ కాలేజ్‌కు తీసుకెళ్లినప్పుడు మొదటిసారి ముజమ్మిల్‌ను కలిశానని అతడు విచారణలో వెల్లడించాడు. దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ, హ్యుందాయ్ i20 కారుతో ఆత్మాహుతి దాడి జరిపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అదుపులో ఉన్నారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన అనేకమంది డాక్టర్లకు కూడా ఈ ఘటనతో సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తున్నందున, దర్యాప్తును విస్తృతస్థాయిలో కొనసాగిస్తున్నారు.