Delhi Bomber: నమాజ్,హిజాబ్ గురించి మహిళా రోగులకు ప్రశ్నలు..: రోగులను ప్రశ్నించిన డాక్టర్ ఉమర్ నబీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబు పేలుడుకు కారణమైన ఉగ్రవాది, డాక్టర్ ఉమర్ నబీ గురించిన పలువురు షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (జీఎంసీ)లో పనిచేసిన రోజుల్లో అతడి విచిత్ర ప్రవర్తనను సిబ్బంది గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా రోగులతో అతడు చూపిన అనుచిత వైఖరి గురించి వారి అనుభవాలు వెలుగులోకొస్తున్నాయి. తర్వాత ఆత్మాహుతి బాంబర్‌గా మారిన ఉమర్, ఢిల్లీలో జరిగిన దాడిలో 14 మందిని బలితీసుకున్నాడు. అతడు ఏ విధంగా తీవ్రవాద సిద్ధాంతాలకు లోనయ్యాడన్న అంశమై దర్యాప్తు సంస్థలు కూడా వివరాలను సేకరిస్తున్నాయి.
వివరాలు
రోజులో ఎన్ని సార్లు నమాజ్ చేస్తున్నారు?
తరుచుగా అతను మహిళా రోగులతో సమస్యాత్మకంగా వ్యవహరించేవాడని, హిజాబ్ ధరించకపోవడంపై ప్రశ్నించే వాడని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ''మీరు హిజాబ్ ఎందుకు పెట్టుకోలేదు?'', ''తలను ఎందుకు సరిగా కప్పుకోలేదు?'' వంటి ప్రశ్నలు అతడు వారితో మాట్లాడుతుండగా విన్నామని సిబ్బంది చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ''రోజులో ఎన్ని సార్లు నమాజ్ చేస్తున్నారు?'' అని అడిగి, మతాచారం పాటించని వారిపై అసహనం చూపేవాడని కూడా తెలిసింది. ఉమర్ అత్యంత తీవ్రవాద మనస్తత్వాన్ని కలిగి ఉండే వాడని, ఇతర మతాల కంటే ఇస్లాం ఆధిపత్యం ఉండాలని ఆశించే ధోరణి అతడిలో స్పష్టంగా కనిపించేదని అక్కడి సిబ్బంది అధికారులకు వివరించారు. క్లాస్‌రూమ్‌లలో అబ్బాయి-అమ్మాయి విద్యార్థులను వేరుచేయాలని కూడా ఆయన ఒత్తిడి తెచ్చాడని సమాచారం.
వివరాలు
అల్-ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్
అతడి జోక్యంతో కొంత మంది రోగులు అసౌకర్యంగా భావించి, చివరికి జీఎంసీ అనంత్‌నాగ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీన్నితర్వాత ఆసుపత్రి అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సంఘటన అనంతరం ఉమర్ హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. నవంబర్ 10న జరిగిన ఆత్మాహుతి దాడికి కొద్దిరోజుల ముందు అతడు ఒక వీడియోను రికార్డు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ క్లిప్ జమ్మూ-కాశ్మీర్‌లో ఉన్న ఉమర్ సోదరుడికి ఇచ్చిన ఫోన్‌లో సేవ్ అయి ఉందని తెలుస్తోంది.