ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
హర్యానా, యూపీ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిల్లీ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే యమునా నది ప్రమాదకర హెచ్చరికలు దాటింది.
అంతకుముందు సీఎం వరదలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలపై అలెర్ట్ గా ఉన్నామని, దిల్లీకి వరద పరిస్థితి రాకపోవచ్చని నిపుణులు అంచనా వేసినట్టు కేజ్రీవాల్ అన్నారు.
ఇది నిందించుకునే సమయం కాదని, ప్రజలకు సాయం అందించాల్సిన సమయం అని కేజ్రీ తెలిపారు. కష్టకాలంలో అందరం కలిసి పనిచేయాలని సూచించారు.
DETAILS
హత్నికుండ్ బ్యారేజ్ నీటి విడుదలతో యమున నదికి వరద ముప్పు
యమునా నదిలో అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్న అంశంపై కేంద్ర జల కమిషన్‌ను సంప్రదించామని కేజ్రీవాల్ వెల్లడించారు.
నీటిమట్టం 206 మీటర్లు దాటితే లోతట్టు ప్రాంతాల్లోని జనాలను ఖాళీ చేయిస్తామన్నారు.
అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎప్పటికప్పుడు రోడ్లపై ఏర్పడే గుంతలను పూడుస్తున్నామన్నారు.మరోవైపు ఇటీవలే దిల్లీలో రోడ్డు కుంగిన ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.
ఎడతెరిపి లేని వానలకు హత్నికుండ్ బ్యారేజ్ నుంచి మరింత నీటిని విడుదల చేశారు.దీంతో సోమవారం ఒంటి గంట వరకు దిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం వార్నింగ్ మార్క్ 204.5 మీటర్లు దాటి 204.63 మీటర్లకు చేరుకుంది.
మంగళవారం మధ్యాహ్నం 12 వరకు నీటిమట్టం 205.33 మీటర్లు దాటి 205.5 మీటర్లకు చేరే ప్రమాదం ఉందని అంచనా వేశారు.