LOADING...
Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన: కానిస్టేబుల్ కాల్పుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ మృతి
దిల్లీలో షాకింగ్ ఘటన: కానిస్టేబుల్ కాల్పుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ మృతి

Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన: కానిస్టేబుల్ కాల్పుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 27, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆహార సరఫరా చేసే యువకుడిపై పోలీసు విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ఉన్న స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల సమయంలో ఢిల్లీ శివారులోని జాఫర్‌పూర్ కలాన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,పాండవ్ కుమార్ (21) తన స్నేహితుడు కృష్ణతో కలిసి పుట్టినరోజు వేడుక నుంచి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో రోడ్డుపై నిలబడి మాట్లాడుతుండగా, ఎదురింట్లో నివసించే హెడ్ కానిస్టేబుల్ నీరజ్ అక్కడికి వచ్చి వారితో వాగ్వివాదానికి దిగాడు.

వివరాలు 

కులం అడిగి, బిహార్ వారని తెలియగానే కాల్చాడంటున్న కుటుంబ సభ్యులు

ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి లోనైన నీరజ్, బైక్‌పై ఉన్న పాండవ్ ఛాతీపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బుల్లెట్ పాండవ్ శరీరాన్ని దాటుకుని వెనుక కూర్చున్న కృష్ణ పొట్టలోకి దూసుకెళ్లింది. గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించగా, పాండవ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, కులం పేరుతో దూషిస్తూ కాల్పులు జరిపాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము బిహార్‌కు చెందిన వారమని తెలిసిన వెంటనే కాల్పులు జరిపి పారిపోయాడని పాండవ్ తల్లి మీనా దేవి ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు 

నిందితుడైన కానిస్టేబుల్ పరారీ, గాలింపు చేపట్టిన పోలీసులు

తన కుమారుడి మరణానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కుటుంబానికి పాండవ్ ఒక్కరే ఆధారం అని బంధువులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న నిందితుడు నీరజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement