Delhi couple: సోషల్ మీడియా పోస్ట్‌తో బయటపడిన పాక్ ISI నెట్‌వర్క్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించిన గూఢచర్య నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించి ఛేదించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. గూఢచర్య కార్యకలాపాలకు దారి
పోలీసుల వివరాల ప్రకారం.. 2024లో సాహిల్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
కొంతకాలానికి ఆ సంబంధం గూఢచర్య కార్యకలాపాల దిశగా వెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.
పాకిస్థాన్‌లో ఉన్న హ్యాండ్లర్లతో సాహిల్, సమీరా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేసే ప్రక్రియలో దంపతులు సహకరించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
పాక్‌కు 8 భారతీయ సిమ్ కార్డులు?
2024-25 మధ్య కాలంలో సాహిల్, సమీరా కలిసి ఎనిమిది భారతీయ సిమ్ కార్డులను సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.
వీటిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపినట్లు వెల్లడించారు. ఇందుకు ప్రతిఫలంగా దంపతులకు దాదాపు రూ.30 వేల వరకు నగదు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాకిస్థాన్‌కు చేరిన ఈ సిమ్ కార్డులతో అక్కడ వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఆ ఖాతాల ద్వారా భారతీయులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
అంతేకాకుండా కొన్ని వాట్సాప్ ఖాతాలను ఉపయోగించి భారతీయ వాట్సాప్ గ్రూపుల్లోకి ప్రవేశించి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వివరాలు
సైనిక ప్రాంతాలపై నిఘా.. సమాచార సేకరణ
భారత్‌లోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాలను పరిశీలించడం, గూఢచర్య కార్యకలాపాలకు ఉపయోగపడే సమాచారాన్ని సేకరించడం, మరికొందరిని ఈ నెట్‌వర్క్‌లోకి చేర్చడం వంటి పనులను సాహిల్‌కు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
కోర్ట్ మార్షల్‌ను ఎదుర్కొంటున్న సైనిక సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని కూడా సాహిల్ అందించినట్లు దర్యాప్తులో గుర్తించామని పోలీసులు తెలిపారు.
దీంతో అతడి కార్యకలాపాలపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.
వివరాలు
మొబైల్ ఫోన్ పరిశీలనతో వెలుగులోకి సమీరా పాత్ర
సాహిల్‌ను ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో పోలీసులు తొలుత అరెస్టు చేశారు.అనంతరం అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించారు.
ఆ ఫోన్‌లో పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో అతడు జరిపిన సంభాషణలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ డిజిటల్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగించగా సమీరా పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరున్నారు?
నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం వాటిలో ఉన్న డిజిటల్ ఆధారాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
ఈగూఢచర్య నెట్‌వర్క్‌తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి?ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి?
ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములయ్యారా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.