Dhruv Rathee Arrest Warrant: ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్.. పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018లో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలోని సాకేత్ కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనమ్ రయీస్ ఖాన్ సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. 2018లో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన ఓ వీడియో ఈ కేసుకు ప్రధాన కారణంగా నిలిచింది.
వివరాలు
'బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2' వీడియోతో వివాదం
2018 మేలో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో 'బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2' పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు.
బీజేపీ ఐటీ సెల్ తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందని బీజేపీ సోషల్ మీడియా మద్దతుదారు వికాస్ పాండే ఆరోపించినట్లు ఆ వీడియోలో రాఠీ పేర్కొన్నారు.
అయితే, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాటి వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటోందని వికాస్ పాండే అభ్యంతరం తెలిపారు.
దీంతో 2018లోనే ధ్రువ్ రాఠీపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
వివరాలు
కేజ్రీవాల్‌పైనా పరువు నష్టం చర్యలు
ధ్రువ్ రాఠీ రూపొందించిన ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.
అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశారు.
దీంతో వీడియోను రూపొందించిన ధ్రువ్ రాఠీతో పాటు దాన్ని రీట్వీట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌పైనా వికాస్ పాండే పరువు నష్టం చర్యలు ప్రారంభించారు.
ఈ కేసులో వీడియోను రూపొందించి ప్రచురించిన రాఠీపై విచారణ కొనసాగుతోంది.
ఈ కేసులో ధ్రువ్ రాఠీకి గతంలోనూ న్యాయస్థానం పలుమార్లు సమన్లు జారీ చేసింది.
వివరాలు
పలుమార్లు సమన్లు.. అయినా కోర్టుకు హాజరుకాని రాఠీ
2019 జులైలో తొలిసారిగా ఆయనకు సమన్లు అందించినట్లు కోర్టు రికార్డుల్లో ఉంది.
అయితే, ఆయన విదేశాల్లో నివసిస్తుండటంతో సమన్లు అందజేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
తాజాగా అక్టోబర్ 17, 31 తేదీల్లో ధ్రువ్ రాఠీకి బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన కోర్టుకు హాజరుకాలేదు.
గతంలో జారీ చేసిన వారెంట్లు కూడా అమలు కాకపోవడంతో న్యాయస్థానం ఈసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
డిసెంబర్ 3న ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది. కాగా, ధ్రువ్ రాఠీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని గతంలో ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ధ్రువ్ రాఠీ భారత్‌కు వచ్చి వెళ్లారు.