Air Pollution: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ.. రోజురోజుకీ క్షీణిస్తున్న గాలి నాణ్యత
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. దీపావళి వేడుకల అనంతరం గాలి నాణ్యత మరింత క్షీణించి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) తాజా నివేదిక ప్రకారం,దీపావళి అనంతరం రెండో రోజు అయిన బుధవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్న స్థితిలో నమోదైంది. ఆ సమయంలో ఏక్యూఐ (AQI) స్థాయిలు 345 పాయింట్లుగా నమోదయ్యాయి.ఉదయం 6:15 గంటలకు అశోక్ విహార్,బవానా, దిల్షాద్ గార్డెన్ ప్రాంతాల్లో AQI 380కి చేరింది. అలాగే డీటీయూ, ఎయిర్‌పోర్ట్, లోధి రోడ్డు వంటి ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత సూచీ 300 పైనే నమోదైంది.
వివరాలు
"వెరీ పూర్" స్థాయికి ఢిల్లీలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో వాయు నాణ్యత
దీని ఫలితంగా రాజధాని అంతా దట్టమైన పొగమంచుతో కప్పుకుపోయింది. దృశ్యమానం (విజిబిలిటీ) గణనీయంగా తగ్గిపోవడంతో వాహనదారులు ముందున్న రహదారి సరిగా చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల టపాసుల కాల్పుల పరిమితిని ఉల్లంఘించి,అనేక ప్రాంతాల్లో ప్రజలు విస్తృతంగా టపాసులు కాల్చినట్లు తెలిసింది. దాంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో వాయు నాణ్యత "వెరీ పూర్" స్థాయికి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం,మంగళవారం ఉదయం 8 గంటలకు AQI స్థాయి 352 పాయింట్లుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)నిర్ణయించిన పరిమితికి 15రెట్లు ఎక్కువ.ఇక ఈ నెల 20న AQI 345గా నమోదు అయ్యింది.
వివరాలు
గాలి నాణ్యత సూచీ
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (SAFAR) నివేదిక ప్రకారం, గాలి నాణ్యత సూచీ 447కు చేరినప్పుడు దానిని తీవ్ర కాలుష్య స్థాయిగా పరిగణించాలి. సాధారణంగా AQI 0-100 మధ్య ఉంటే గాలి శుద్ధంగా ఉందని, 100-200 మధ్య ఉంటే మధ్యస్థ స్థాయిలో ఉందని అర్థం. 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా, 300-400 మధ్య ఉంటే మరింత అధ్వాన్నంగా, 400-500 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకరమైన వాయు కాలుష్యంగా పరిగణిస్తారు.