Mamata Banerjee: ఎన్నికల్లో గెలిచిన తర్వాత దిల్లీనే నా టార్గెట్.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్‌లో శుక్రవారం శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతాపార్టీ దేశంలో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని హెచ్చరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీని స్వాధీనం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగుతానని పేర్కొన్నారు. బెంగాల్‌లోని రాణిగంజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించి వారిని బయటకు గెంటేస్తారని మమత ఆరోపించారు.
వివరాలు
వసతి గృహంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం
తమ రాజకీయ లాభాల కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తూ బీజేపీ నాయకులు అన్ని హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎన్నికల ముందు 'సర్' ప్రక్రియను హడావిడిగా చేపట్టిందని విమర్శించారు. ఓటరు జాబితా నుంచి బెంగాలీ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్‌ను బీజేపీ పావులా వాడుకుంటోందని ఆరోపించారు. ఇక రాణిగంజ్ పరిసర పర్వత ప్రాంతాల్లో తరచూ కొండచరియలు విరిగిపడుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు మారితే, వారికి గృహవసతితో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.