SpiceJet:ఇంజిన్‌లో అనుమానాస్పద లోపం.. 150 మందితో బయలుదేరిన ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం మంగళవారం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్యతో తిరిగి ఢిల్లీకి చేరింది. SG121 నంబర్‌తో నడుస్తున్న ఈ బోయింగ్ 737 విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎగిరే సమయంలో ఇంజిన్‌లో అనుమానాస్పద లోపం కనిపించడంతో పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా విమానం నుండి దిగిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు జరగలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వివరాలు
స్పైస్‌జెట్ కార్యకలాపాల విశ్వసనీయతపై మళ్లీ ప్రశ్నలు
ప్రభావిత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని స్పైస్‌జెట్ స్పష్టం చేసింది. అయితే ఈ ఘటనతో స్పైస్‌జెట్ కార్యకలాపాల విశ్వసనీయతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు కొత్త విమానాలను వెట్, డ్యాంప్ లీజుల ద్వారా చేర్చుకుని, గ్రౌండ్‌లో ఉన్న విమానాలను దశలవారీగా సేవల్లోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.పెరిగిన ఆపరేటింగ్ ఖర్చులు, ఒక్కసారిగా వచ్చిన వ్యయాల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో రూ.269.27 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
వివరాలు
తగ్గిన స్పైస్‌జెట్ షేర్లు
ఇదిలా ఉండగా పెండింగ్ బకాయిల కారణంగా బంగ్లాదేశ్ తమ గగనతలాన్ని వినియోగించకుండా స్పైస్‌జెట్‌కు నిషేధం విధించింది. దీంతో కోల్‌కతా నుంచి గువాహటి, ఇంఫాల్‌కు వెళ్లే కొన్ని సర్వీసులు మరో మార్గంలో తిరిగి నడపాల్సి వస్తోంది. ఈ అంశంపై అధికారులతో చర్చలు జరుగుతున్నాయని సంస్థ తెలిపింది. అయినప్పటికీ విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేర్లు సుమారు 1 శాతం తగ్గి ఒక్కోటి రూ.16.81 వద్ద ట్రేడయ్యాయి.