దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని హోటల్‌లో మీటింగ్‌లు, ఫోన్‌లు ఎందుకు ధ్వంసం చేశారు? రూ.100 కోట్లు స్కామ్ వంటి అనేక ప్రశ్నలు కవితను అడిగినట్లు తెలిసింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు ఈడీ అధికారుల బృందం కవితను విచారిస్తున్నారు. తొలుత కవితను విడిగా ప్రశ్నించి, ఆ తర్వాత రామచంద్ర పిళ్లై, సిసోడియాతో కలిసి విచారించే అవకాశం ఉంది.
తెలంగాణ భవన్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీ వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వాటిపై 'బైబై మోదీ', 'మోదీ డిస్ట్రాయర్ ఆఫ్ డెమోక్రసీ' 'రంగులు ఎప్పటికీ ఫేడ్ కావు' అనే క్యాప్షన్లు కూడా ఉన్నాయి. ఆ పోస్టర్లపై కవితతో పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, ఇతర బీజేపీ నాయకుల ఫోటోలను ముద్రించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలోని నగర శివార్లలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే, తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు