సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పోయే ముచ్చటే లేదని, షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్‌లో ఎన్నికలు జరగుతాయని కేసీఆర్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. నియోజక వర్గాల వారీ సమావేశాలు నిర్వహించుకోవాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ
విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై కూడా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఈ నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని చేప్పారు. నాయకులు అవసరమైతే నియోజగవర్గాల వారీగా పాదయాత్రలు చేసుకోవాలని సూచించారు. తాము ముందుస్తు ఎన్నికలకు పోవట్లేదని కేసీఆర్ చెప్పినా, ఆ మాటల వెనుక వ్యూహం ఉండి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 11వ తేదీన కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో గురువారం క్యాబినేట్ భేటీ పెట్టడం, శుక్రవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం వెనుక బలమైన వ్యూహమే ఉండి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.