సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్
త్వరలో ప్రారంభం కానున్న కొత్త సచివాలయ భవనం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం తుది దశ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిశీలించారు. తొలుత సీఎం కేసీఆర్ సచివాలయ పనులను పరిశీలించారు. చివరి దశలో ఉన్న ఎలివేషన్ పనులు, ఫౌంటెయిన్లు, గ్రీన్ లాన్లు, తాపీ పనులు ఎంతవరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన చెక్కబొమ్మలతో ఆరో అంతస్తులోని ఛాంబర్‌లు, ఫర్నీచర్ పనులు పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. తెల్ల గోడలపై బంగారు అంచులు, మార్బుల్ ఫ్లోరింగ్, గోడలపై రంగులు, విశాలమైన కారిడార్, సచివాలయ సముదాయం మొత్తం వెంటిలేషన్, స్వచ్ఛమైన గాలి వచ్చేలా నిర్మాణాన్ని చేపట్టడంపై అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
మంత్రుల ఛాంబర్లన్నీ ఒకే చోట ఉండేలా చూడాలని సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారుల కోసం ఏర్పాటు చేస్తున్న ఫర్నీచర్, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. చీఫ్ సెక్రటరీ ఛాంబర్లు, కాన్ఫరెన్స్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్స్‌లోని సౌకర్యాలను కూడా పరిశీలించారు. కలెక్టర్ల సమావేశ మందిరం, జీఏడీ ప్రోటోకాల్ అధికారుల ఛాంబర్లు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వీఐపీల వెయిటింగ్ లాంజ్‌ల పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రుల ఛాంబర్లన్నీ ఒకే చోట ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 125 అడుగుల డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడి పనుల పురోగతిపై అధికారులు వివరించారు. అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ ఆడిటోరియం, లేజర్ షో సౌకర్యం, ర్యాంపులు, పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించారు.