తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు
ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటుపై పోలీసు శాఖ చర్యలు ప్రారంభించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు సూచించారు.
యువతి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్
ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఓ యువతి చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ ఈ మేరకు స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల మహిళలకు సురక్షితమైన రవాణా (క్యాబ్/ఆటో) సౌకర్యాన్ని అందించాలని మంత్రి కేటీఆర్, కవితను ట్విట్టర్‌లో హర్షిత అనే యువతి ట్యాగ్ చేశారు. మహిళలకు ఈ సౌకర్యాన్ని బహుమతిగా ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. మెట్రో సౌకర్యం అందుబాటులో లేనప్పుడు అంటే రాత్రి పదిగంటల నుంచి ఉదయం 5గంటల వరకు ట్రాకింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని హర్షిత కోరారు. దీంతో స్పందించిన కేటీఆర్ వీలైనంత త్వరగా అన్ని రైల్వే, బస్ స్టేషన్లలో ట్రాకింగ్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ ట్వీట్ చేశారు.