రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించాల్సి ఉండగా, శుక్రవారం అరుణ్‌రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ ఎదుట తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీకి కోర్టు నోటీసులు పంపింది. దిల్లీ ఎక్సైజ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై ఇప్పటికే అరెస్టయ్యారు. రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కవితను విచారించడానికి ఒకరోజు ముందు రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకోవాలని నిర్ణయిచండంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌కు 32.5 శాతం వాటాలు?
అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఇప్పటికే తాను కవిత బినామీ అని వాంగ్మూలంలో చెప్పారు. ఆమె చెప్పినందు వల్లే తన ఖాతాలోకి 32కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. కోటి రూపాయలు కూడా తన ఖాతాలోకి వచ్చినట్లు తెలిపారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌కు 32.5 శాతం వాటాలు ఉన్నాయని ఈడీ అభియోగాలు మోపింది. వీటిలో కవితకు కూడా వాటా ఉందని ఈడీ ఆరోపిస్తోంది. కవిత, పిళ్లై ఖాతాల్లోకి లాభాలు వెళ్లినట్లు ఈడీ వద్ద డిజిటల్ ఆధారాలు ఉన్నాయి. శనివారం అరుణ్ రామచంద్ర పిళ్లై సమక్షంలో కవితను విచారించనున్నారు. ఈ క్రమంలో రామచంద్ర పిళ్లై అదంతా తాను చెప్పలేదని చెప్పే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.