దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు, మద్దతుదారులు భారీగా చేరుకుంటున్నారు. కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ శుక్రవారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ మద్యం కేసులో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కవిత జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవిత విచారణ
ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత మార్చి 8న ఆమె దేశ రాజధానికి వచ్చారు. సోమవారం రాత్రి మద్యం పాలసీ కేసులో అరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కవితను ముఖాముఖిగా ఈడీ విచారించనుంది. పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఇప్పటికే తాను కవిత బినామీ అని వాంగ్మూలంలో చెప్పారు. ఆమె చెప్పినందు వల్లే తన ఖాతాలోకి 32కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. కోటి రూపాయలు కూడా తన ఖాతాలోకి వచ్చినట్లు తెలిపారు. అయితే ఈడీ ఎదుట తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో పిళ్లై పిటిషన్ దాఖలు చేడయంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.