Loading...
Delhi: ధనవంతుడినంటూ నమ్మించి.. 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా
ధనవంతుడినంటూ నమ్మించి.. 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా

Delhi: ధనవంతుడినంటూ నమ్మించి.. 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోటీశ్వరుడినని, వ్యాపారవేత్తనని నమ్మిస్తూ 20 మంది మహిళా కానిస్టేబుళ్లను మోసం చేసి, దాదాపు రూ.24 లక్షలు కాజేసిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విక్రాంత్ తోమర్ అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో అతడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

దిల్లీలోని కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ విక్రాంత్ తోమర్‌పై ఫిర్యాదు చేశారు.

తాను వ్యాపారవేత్తనని పరిచయం చేసుకున్న అతడు,పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆమె ఆరోపించారు.

అంతేకాకుండా బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించాడు.

అతడి మాటలు నమ్మిన బాధితురాలు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు మరో రూ.12లక్షలు వ్యక్తిగత రుణంగా తీసుకుని ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొత్తంగా రూ.24లక్షలు అతడి చేతిలో పెట్టినట్లు తెలిపారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో విక్రాంత్ అసలు వ్యాపారవేత్త కాదని,సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి తన సంపన్న జీవనశైలిపై ఇతరులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు.

వివరాలు 

విలాసవంతమైన జీవితం పేరుతో వల..

ఇదే పద్ధతిలో మరో 19 మంది మహిళా కానిస్టేబుళ్లను కూడా మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

విక్రాంత్ సోషల్ మీడియాలో ప్రముఖ రెస్టారెంట్లు, ఖరీదైన కార్లు, పెద్ద భవనాల్లో గడుపుతున్నట్లు చూపించే ఫొటోలు, పోస్టులు పెట్టేవాడు.

తాను ధనవంతుడైన వ్యాపారవేత్తనని నమ్మిస్తూ యువతులతో పరిచయాలు పెంచుకునేవాడు. వారిని మరింతగా నమ్మించేందుకు ఖరీదైన కార్లను ఎనిమిది గంటల పాటు అద్దెకు తీసుకుని, ఒక్కొక్కరిని బయటకు తీసుకెళ్లేవాడని పోలీసులు గుర్తించారు.

ఇలా తనకు ఉన్నట్లు చూపించిన విలాసవంతమైన జీవితం ద్వారా మహిళలను ఆకర్షించి, వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

గతంలోనూ కేసులు..

ఈ కేసులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. విక్రాంత్‌తో సహజీవనం చేస్తున్న మహిళ కూడా పోలీస్ కానిస్టేబులేనని దర్యాప్తులో తేలింది.

ఆమె ద్వారానే ఇతర మహిళా కానిస్టేబుళ్ల వివరాలు తెలుసుకుని, వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులంతా ఒకే బ్యాచ్‌కు చెందినవారని తెలుస్తోంది.

విక్రాంత్ తోమర్‌పై గతంలోనూ ఇలాంటి మోసాలకు సంబంధించి పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది జూన్‌లో అతడు బెయిల్‌పై విడుదలైనట్లు వెల్లడించారు. తాజాగా మరో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో అతడి మోసాల వ్యవహారం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ADVERTISEMENT