Delhi AQI: దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ తర్వాత దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రరూపం దాల్చింది. సోమవారం (2026 నవంబర్ 9) ఉదయం నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 6 గంటలకు ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 366గా నమోదైంది. దీంతో వాతావరణ పరిస్థితులను 'వెరీ పూర్' (చాలా దారుణం)కేటగిరీలో చేర్చారు. నగరంలోని 15 మానిటరింగ్ కేంద్రాల్లో ఏక్యూఐ 400 మార్కును దాటడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అర్ధరాత్రి నుంచే ఢిల్లీని దట్టమైన పొగమంచు (స్మాగ్) కమ్మేసింది. దీంతో సమీపంలోని వస్తువులు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. భారత వాతావరణ శాఖ (IMD) నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యంత దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
అత్యధిక కాలుష్యం నమోదైన ప్రాంతాలివే..
ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, షాహద్రా, ఉత్తర, దక్షిణ, మధ్య ఢిల్లీ ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని తెలిపింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరింది.
సోనియా విహార్‌లో అత్యధికంగా 449 నమోదైంది. బురారీ క్రాసింగ్‌లో 445,వివేక్ విహార్‌లో 441, జహంగీర్పురిలో 439,ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో 437,రోహిణిలో 435, డీటీయూలో 431, బవానాలో 424గా నమోదైంది.
అలాగే చాందినీ చౌక్, పట్పర్‌గంజ్‌లో 418, ముండ్కాలో 413, ఎన్‌ఐహెచ్ నరేలా,పంజాబీ బాగ్‌లో 408, ఐటీఓ, కామన్వెల్త్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో 404 చొప్పున ఏక్యూఐ నమోదైంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)స్టేజ్-3 ఆంక్షలు ఇప్పటికే అమల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు..
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
దేశ రాజధానిలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు అలాంటి ప్రభుత్వమే అధికారంలో ఉందని వ్యాఖ్యానించారు.
ఈ సమస్యకు ఢిల్లీ ముఖ్యమంత్రిని మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించాయి.
ఏడాది పొడవునా కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోకపోవడంతోపాటు దీపావళికి ముందే అవసరమైన జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆరోపించాయి.
వివరాలు
బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు..
వాతావరణ పరిస్థితులు మారగానే కాలుష్య సమస్యను పట్టించుకోవడం మానేస్తారని, మళ్లీ అక్టోబర్, నవంబర్ నెలల్లో అదే సమస్య తెరపైకి వస్తుందని విమర్శించాయి.
విపక్షాల విమర్శలపై ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఎదురుదాడికి దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
కాలుష్యం పేరుతో దీపావళి పండుగతోపాటు సనాతన ధర్మంపై దాడి చేసే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంత ప్రజలు ప్రస్తుత కాలుష్య పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దట్టమైన పొగమంచు, అధిక కాలుష్యం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.