Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
సాక్షి హత్య కేసు విచారణలో దిల్లీ పోలీసులు మరో పురోగతిని సాధించారు. వాయువ్య దిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాక్షిని హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, సాహిల్ కస్టడీని కోర్టు మరో మూడు రోజులు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే సాహిల్ తరచూ తన స్టేట్‌మెంట్‌లను మారుస్తున్నందున క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. హత్యకు గురైన బాలిక స్నేహితులైన భావన, అజయ్ అలియాస్ జబ్రూ, నీతూలను కూడా పోలీసులు విచారించారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో సాహిల్‌తో ఈ నేరంలో ఎవరికీ సంబంధం లేదని తేలిందని, తాను ఒక్కడినే చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
ఈ హత్య కేసులో మరిన్ని వివరాలు
ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు నిందితుడు సాహిల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కీలక ఆధారాలను సేకరించారు. సీసీటీవీ వీడియోలో కనిపించిన ఎనిమిది మంది వ్యక్తులను కూడా గుర్తించామని, వారి వాంగ్మూలాలను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన ప్రదేశం మాత్రమే కాకుండా రిథాలా నుంచి ఆనంద్ విహార్ మీదుగా బులంద్‌షహర్ వరకు ఉన్న మొత్తం సిసిటివి ఫుటేజీలను స్కాన్ చేసే పనిలో ఉన్నామని దిల్లీ పోలీసులు తెలిపారు. 16ఏళ్ల సాక్షి అనే బాలికను మే 28న సాహిల్ అనే యువకుడు అతికిరాతకంగా కత్తి పొడిచి, సిమెంట్ స్లాబ్‌తో కొట్టి హత్య చేశాడు. మరుసటి రోజు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సాహిల్‌ను అరెస్టు చేశారు.