Delhi: ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఇవాళ ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 4.9 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయాయి. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోవడంతో ప్రజలు తీవ్ర చలికి గజగజ వణికిపోతున్నారు, ఇక నిరాశ్రయులు రాత్రిపూట నైట్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. చలికి తోడు, ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా అధిక స్థాయిలో కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) డేటా ప్రకారం,ఉదయం 7 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 209గా నమోదైంది.
అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో 218 ఏక్యూఐ లెవల్స్ నమోదు
ఆనంద్ విహార్‌లో 218, అశోక్ విహార్‌లో 227, ద్వారకాలో 250, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో 218 ఏక్యూఐ లెవల్స్ నమోదు అయ్యాయి. ఇతర ప్రాంతాలలో ఏక్యూఐ 148, బురారీ క్రాసింగ్ వద్ద 187, ఛాందినీ చౌక్ ప్రాంతంలో 181, డీటీయూలో 165గా నమోదైయ్యాయి. గాలి నాణ్యత స్థాయిలు 0 నుంచి 50 మధ్య ఉంటే అది మంచి గాలిగా పరిగణించబడుతుంది, 51 నుంచి 100 వరకు సంతృప్తికరమైనది, 101 నుంచి 200 వరకు మితమైన నాణ్యత, 201 నుంచి 300 మధ్య తక్కువ నాణ్యత, 301 నుంచి 400 వరకు చాలా పేలవమైనది, 401 నుంచి 500 వరకు ప్రమాదకర స్థాయిగా పరిగణించబడుతుంది.