Delhi Red Fort blast: ఎర్రకోట పేలుడుకు ఏడాది.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఏడాది క్రితం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. 2025 నవంబర్ 10న సాయంత్రం జరిగిన ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 29 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగిస్తోంది. ఏడాది తర్వాత దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలు పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నాయి.
వివరాలు
కారులో భారీ పేలుడు.. 11 మంది మృతి
2025 నవంబర్ 10న సాయంత్రం సుమారు 6.50 గంటలకు ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో హ్యుందాయ్ ఐ20 కారులో భారీ పేలుడు సంభవించింది.
జనసంచారం ఎక్కువగా ఉన్న రహదారిపై ఒక్కసారిగా పేలుడు జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 29 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో కారును ఉమర్ ఉన్ నబీ నడిపినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది.
వివరాలు
ఎర్రకోట కాదు.. లాల్ మందిర్ అసలు లక్ష్యమా?
ఈ కేసు విచారణలో అసలు లక్ష్యానికి సంబంధించిన అంశం ఆసక్తికరంగా మారింది.
ఎన్ఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీ తొలుత జైన దేవాలయమైన లాల్ మందిర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే అక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు పోలీసుల నిఘా ఉండటాన్ని గమనించి చివరి నిమిషంలో తన ప్రణాళికను మార్చుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఆ తర్వాత ఎర్రకోట సమీపానికి చేరుకున్న కొద్దిసేపటికే కారులో పేలుడు సంభవించింది.
వివరాలు
దాడి వెనుక ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీ
ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఉమర్ ఉన్ నబీని ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారిగా పేర్కొంది.
అతడు పిండా, రాహుల్ భట్ అనే పేర్లతో కూడా వ్యవహరించినట్లు వెల్లడించింది.
అల్‌ఖైదా అనుబంధ సంస్థగా దర్యాప్తు సంస్థ పేర్కొన్న అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద మాడ్యూల్‌కు అతడు కార్యాచరణ బాధ్యతలు నిర్వహించినట్లు ఆరోపించింది.
కొత్తవారిని నియమించుకోవడం, సమావేశాలు నిర్వహించడం, శిక్షణ ఏర్పాట్లు చేయడం ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది.
వివరాలు
రెండేళ్లలో 12 సార్లు ఎర్రకోటకు వెళ్లిన నబీ
పేలుడు జరగడానికి ముందు రెండేళ్ల వ్యవధిలో ఉమర్ ఉన్ నబీ ఏకంగా 12 సార్లు ఎర్రకోటను సందర్శించినట్లు ఎన్ఐఏ గుర్తించింది.
ఈ పర్యటనలు దాడికి సంబంధించిన ముందస్తు పరిశీలనలో భాగమై ఉండొచ్చని అనుమానిస్తోంది. పేలుడు జరిగిన సమయంలో నబీ కూడా మరణించాడు.
అతడి గత కార్యకలాపాలు, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లో అతడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
అల్ ఫలాహ్ యూనివర్సిటీతో ఉగ్రవాద మాడ్యూల్ సంబంధాలు
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఉమర్ ఉన్ నబీ.. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
ఈ కేసు దర్యాప్తులో యూనివర్సిటీకి చెందిన కొందరు వైద్య సిబ్బందికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో మరో ఇద్దరు వైద్యులు డాక్టర్ ముజమ్మిల్ గనాయ్, డాక్టర్ షహీన్ సయీద్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
వివరాలు
అల్ ఫలాహ్ యూనివర్సిటీతో ఉగ్రవాద మాడ్యూల్ సంబంధాలు
ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
అయితే దాడి జరిగి ఏడాది గడిచినా.. దీని వెనుక ఉన్న పూర్తి ఉగ్రవాద నెట్వర్క్, దాని కార్యకలాపాలు, ఇతర కీలక వ్యక్తుల పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.
దీంతో ఈ కేసులో దర్యాప్తు సంస్థ తదుపరి వెల్లడించే అంశాలపై ఆసక్తి నెలకొంది.