Sonia Gandhi: దీపావళి వేళ కాంగ్రెస్ ర్యాలీ వద్దు.. సోనియా గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ వేళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంఘం (సీటీఐ) కోరింది. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ర్యాలీ కారణంగా పండుగ సీజన్ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి శుక్రవారం లేఖ రాసింది.
వివరాలు
నవంబర్ 1 వ్యాపారులకు ఎంతో కీలకమైన రోజు
ర్యాలీ నిర్వహణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే పండుగ సమయంలో నిర్వహించడంపైనే ఆందోళన ఉందని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ స్పష్టం చేశారు.
నవంబర్ 6న ధనత్రయోదశి, 8న దీపావళి పండుగలు ఉన్నాయని గుర్తుచేశారు.
నవంబర్ 1 వ్యాపారులకు ఎంతో కీలకమైన రోజని తెలిపారు.
ఆ రోజు సుమారు 10 లక్షల మంది ప్రజలు, 15 వేల నుంచి 20 వేల వాహనాలు ఢిల్లీకి వస్తే నగరంలోని 20 ప్రధాన మార్కెట్లలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.
పండుగ సమయంలో వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
ర్యాలీతో నాలుగు ప్రధాన సమస్యలు
నవంబర్ 1న ర్యాలీ నిర్వహిస్తే నాలుగు ప్రధాన సమస్యలు ఎదురవుతాయని సీటీఐ తన లేఖలో వివరించింది.
పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, భారీగా ట్రాఫిక్ స్తంభించడం, సరుకు రవాణాకు ఆటంకాలు ఏర్పడటం, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారాలు దెబ్బతినడం వంటి అంశాలను ప్రస్తావించింది.
రాంలీలా మైదానంలో కనీసం 200 బస్సులను నిలిపేందుకు కూడా తగినంత స్థలం లేదని పేర్కొంది.
అలాంటప్పుడు వేలాది వాహనాలకు పార్కింగ్ ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది.
వివరాలు
20 ప్రధాన మార్కెట్లపై ప్రభావం
రాంలీలా మైదానానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే చాందినీ చౌక్, సదర్ బజార్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, ఖరీ బావోలీతో పాటు మొత్తం 20 ప్రధాన మార్కెట్లు ఉన్నాయని సీటీఐ వెల్లడించింది.
ఈ మార్కెట్లకు ప్రతిరోజూ సుమారు 5 వేల ట్రక్కుల ద్వారా సరుకులు చేరుతాయని, మరో 3 వేల ట్రక్కులు ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వస్తువులను తరలిస్తాయని తెలిపింది.
ర్యాలీ కారణంగా అక్టోబర్ 31 నుంచే రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
పండుగకు ముందు సరుకుల రాకపోకలు నిలిచిపోతే వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొంటున్నారు.
ఈ సమస్యకు పరిష్కారంగా సీటీఐ రెండు ప్రతిపాదనలను సోనియా గాంధీ ముందుంచింది.
వివరాలు
ర్యాలీ వాయిదా వేయాలి.. లేదంటే వేదిక మార్చాలి
మొదటిగా,నవంబర్ 1న జరగాల్సిన ర్యాలీని దీపావళి తర్వాత నవంబర్ 10 లేదా 11వ తేదీకి వాయిదా వేయాలని కోరింది.
ఒకవేళ తేదీ మార్చడం సాధ్యం కాకపోతే రాంలీలా మైదానానికి బదులుగా బురారీగ్రౌండ్‌లో ర్యాలీ నిర్వహించాలని సూచించింది.
అక్కడ సుమారు 15వేల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం ఉందని వివరించింది.
ఈ విషయంపై గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడుసార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన రాలేదని బ్రిజేష్ గోయల్ తెలిపారు.
రాజకీయ కార్యక్రమాల నిర్వహణ కోసం పండుగసీజన్‌లో వ్యాపారుల ఉపాధిని దెబ్బతీయవద్దని ఆయన కోరారు.
దీపావళి సమయంలో వ్యాపారాలు సజావుగా సాగేందుకు కాంగ్రెస్ పార్టీ తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని సీటీఐ ఆశిస్తోంది.