Araku Coffee:పారిస్‌లో ఘుమఘుమలాడుతున్నఅరకు కాఫీ.. త్వరలో మరో అరకు కాఫీ అవుట్‌లెట్
భారతదేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుంటే,అందులో దక్షిణ భారతదేశమైన కర్ణాటక, తమిళనాడు, కేరళ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే అధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ది చెందిన అరబికా రకం కాఫీ పండుతుంది.అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లోప్యారిస్‌లో కాఫీ షాప్ ప్రారంభం అయింది. మొదటిసారిగా దేశం వెలుపల ఏర్పాటైన 'అరకు కాఫీ' ఔట్ లెట్ ఇదే. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని ప్యారిస్ లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం,ఒలింపిక్స్ జరుగుతున్నపారిస్‌లో మరో అరకు కాఫీ అవుట్‌లెట్ ను తెరవాలనుకుంటున్నట్లు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తెలిపారు.
జి20 సదస్సులో అరకు కాఫీ
ఇటీవల న్యూదిల్లీలో నిర్వహించిన జి20 సదస్సులో పాల్గునేందుకు వచ్చిన ప్రపంచ దేశాలనేతలకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్లలో విశాఖపట్టణం జిల్లాలోని అరకులోయ కాఫీకి చోటు దక్కింది . అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది.అంతేకాదు మన్‌కీ బాత్ 111వ ఎపిసోడ్‌లో మోదీ అరకు కాఫీ పై ప్రశంసలు కురిపించారు.
అరకుకాఫీకి ప్రపంచ స్థాయి పేరు
అరకులో పండే కాఫీ పంట నుంచి తీసే కాఫీ అద్భుతమైన రంగు, రుచి వాసన ఉండడంతో ఒకసారి ఈ కాఫీ తాగిన వాళ్ళు మళ్లీ ఆ కాఫీ కోసమే అరకు, ఈ ప్రాంతాలకు వస్తుండడంతో ఇక్కడ పండుతున్న కాఫీకి ''అరకుకాఫీ'' అనే ప్రపంచ స్థాయి పేరొచ్చింది. సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతం ఎప్పుడూ చల్లగా వుంటుంది. అందువల్ల ఇతర పంటల కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కాఫీ పంటకు అనుమతి ఇచ్చిన అటవీ శాఖ
1920లో బ్రిటిష్ వారి ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకం మొదలైంది. విశాఖ మన్యంలో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖపట్నం జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటకు అనుమతి ఇచ్చింది. ప్రారంభంలో సుమారు 10,100ఎకరాలలో కాఫీ సాగునీ అభివృద్ది చేయాలని నిర్ణయించారు. మొదట్లో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈకాఫీ తోటల్ని1985లో అటవీ అభివృద్ధి సంస్ధ చేపట్టింది. అటు తరువాత,1956 లో గిరిజన సహకార సంస్ధ కాఫీ బోర్డుతో టై అప్ అయింది.అలా జీ సీ సీ సంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దాంతో గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపంకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభించింది.
4000 హెక్టర్ల నుండి 1.5 లక్షల ఎకరాల వరకు..
1975 నుంచి 1985 వరకు జిసిసి అద్వర్యంలో కాఫీ తోటల అభివృది విభాగం పేరుతో ఒక ప్రత్యేక విభాగమే ఉండేది. ఈ విభాగం ప్రారంభంలో సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలుపెట్టింది. క్రమేపీ అరకులో తయారయ్యే అర్గానిక్ కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలా పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరించింది. అలా కాలక్రమంలో అరకు కాఫీ ఘుమఘుమలు జపాన్,దక్షిణ కొరియా,స్విట్జర్లాండ్ దేశాలకూ కూడా విస్తరించింది. 2018లో పారిస్ లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూర్స్-2018 పోటీలో అరకు కాఫీ గోల్డ్ మోడల్ పొందింది. దాంతో మరొక్కసారి ప్రపంచవ్యాప్తం గా అరకు కాఫీ ఘనత మరోసారి వెలుగు చూసింది.