T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. ప్రసార హక్కుల నుంచి వైదొలగిన జియోహాట్‌స్టార్
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026)కు భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే ఐసీసీ ప్రకటించింది. అయితే టోర్నీకి ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. టోర్నమెంట్ అధికారిక ప్రసార భాగస్వామిగా ఉన్న జియోహాట్‌స్టార్ (JioHotstar) ఈ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ఐసీసీకి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. నాలుగు సంవత్సరాల భారత మీడియా హక్కుల ఒప్పందంలో ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉండగా, ఈ కాంట్రాక్ట్‌ను కొనసాగించడం సాధ్యం కాదని జియోహాట్‌స్టార్ స్పష్టంచేసిందని వార్తలు చెబుతున్నాయి. భారీ ఆర్థిక నష్టాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Details
భారీ నష్టాలే కారణమన్న సంస్థ
ఇదిలాఉంటే, 2026-29 మధ్యకాలానికి భారత మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను ఐసీసీ తాజాగా ప్రారంభించింది. ఈ హక్కుల విలువ 2.4 బిలియన్ డాలర్ల పరిధిలో ఉంటుందని అంచనా. మరోవైపు, జియోహాట్‌స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారు వైదొలగాలనుకోవడంతో, కొత్త బిడ్లు ఆహ్వానిస్తూ ఐసీసీ పలు ప్రముఖ ఓటీటీ సంస్థలను సంప్రదించింది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలకు ఆహ్వానాలు వెళ్లినట్లు సమాచారం. అయితే మీడియా హక్కుల ఒప్పందం విలువ అత్యంత భారీగా ఉండటంతో ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదని తెలుస్తోంది.