Mallikarjun Kharge: డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు.. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశంలో అధికారాన్ని శాశ్వతంగా తమ చేతుల్లోనే ఉంచుకునేందుకు మోదీ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఢిల్లీలో ఇండియా కూటమి నేతల భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు.
వివరాలు
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు
లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచడం వెనుక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం ఉందని ఆయన ఆరోపించారు.
సవరించిన బిల్లు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం ఈ వర్గాలకు కేటాయించే రిజర్వ్డ్ స్థానాల పెంపుపై బిల్లులో స్పష్టమైన హామీ లేదని పేర్కొన్నారు.
త్వరలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రానున్నప్పటికీ.. వాటి ఆధారంగా కాకుండా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
వివరాలు
కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలి
డీలిమిటేషన్ ప్రక్రియ బాధ్యతలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) అప్పగించాలన్న ప్రతిపాదనను కూడా ఖర్గే వ్యతిరేకించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, ఇప్పటికే ఆయనపై ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘం ద్వారా తమకు అనుకూలమైన నియోజకవర్గాలను జనరల్‌గా, మరికొన్నింటిని రిజర్వ్డ్గా మార్చే అవకాశం ఉందని, తద్వారా అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని ఖర్గే ఆరోపించారు.
వివరాలు
కలిసికట్టుగా పోరాటం
తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలను చీల్చి, విపక్షాలను బలహీనపరిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ బిల్లును ముందుకు తెస్తోందని విమర్శించారు.
ఈ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే దేశానికి తీరని నష్టం జరుగుతుందని ఖర్గే పేర్కొన్నారు.
పార్లమెంట్లో ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా దీనిపై పోరాడతాయని స్పష్టం చేశారు.