Delhi: దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గురువారం ఉదయం ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపించింది.
దాంతో దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది, వాహనదారులకు ముందు వెళ్తున్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
ఈ కారణంగా స్థానికులు, వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉన్న వాయు కాలుష్యానికి తోడు పొగమంచు చేరికతో ఢిల్లీ ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉదయం 10 గంటలు దాటినా కూడా సూర్యుడు కనిపించని పరిస్థితి కొనసాగింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయింది.
వివరాలు
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పొగమంచు ప్రభావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
సాధారణంగా రన్‌వే దృశ్యమానత 200 నుంచి 500 మీటర్ల మధ్య ఉంటే, ఈరోజు ఉదయం అది సున్నాకి చేరింది.
ఫలితంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే 80కుపైగా విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి.
ఫ్లైట్‌రాడార్24 సమాచారం ప్రకారం, కనీసం 80 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, ఇప్పటివరకు ఐదు విమానాలు రద్దయ్యాయి.