Page Loader
UP: యూపీలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రొఫెసర్ల వేధింపులే కారణమా?
యూపీలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రొఫెసర్ల వేధింపులే కారణమా?

UP: యూపీలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రొఫెసర్ల వేధింపులే కారణమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని విద్యాసంస్థల్లో ఆచార్యుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. 'ఆచార్య దేవోభవ' అనే పదానికి మర్యాద మిగలకుండానే, విద్యా బోధన చేయాల్సిన గురువులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఒక దంత వైద్య విద్యార్థిని ప్రొఫెసర్ల వేధింపులను తాళలేక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) రెండో సంవత్సరంలో చదువుతున్న విద్యార్థిని శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గదిలో నుంచి ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పురుష ప్రొఫెసర్‌, మహిళా ఫ్యాకల్టీ సభ్యురాలు మానసికంగా వేధిస్తున్నారని స్పష్టంగా పేర్కొంది.

Details

విశ్వవిద్యాలయ పరిపాలనపై నిరసన

ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాస్టల్‌ ఎదుట జమయ్యి ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రివరకూ నినాదాలు చేస్తూ విశ్వవిద్యాలయ పరిపాలనపై నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు గ్రేటర్ నోయిడా ఏడీసీపీ సుధీర్ కుమార్ శనివారం వెల్లడించారు.

Details

ఘటనపై దర్యాప్తు

విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరగడం విచారకరం. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ప్రొఫెసర్లు ఇలా మానసిక ఒత్తిడికి గురిచేయడం విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయడమేనని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.