Rain Alert: బలపడుతున్న అల్పపీడనం.. నేడు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది ఇదే దిశలో మరింత ముందుకు కదులుతూ క్రమంగా బలపడనుంది.సోమవారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఈ వ్యవస్థ మరింత బలపడే సూచనలు ఉన్నాయి.మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
వివరాలు
ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు
వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సోమవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.